Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం తెలిస్తే షాకే.. రికార్డు స్థాయిలో పెరిగిన వేతనం!

Microsoft CEO Satya Nadella Receives Record Salary Hike
  • 2024-25 ఆర్థిక సంవత్సరానికి 96.5 మిలియన్ డాలర్ల ప్యాకేజీ
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విజయాలే కారణం
  • గత పదేళ్లలో ఇదే అత్యధిక వేతనం అని వెల్లడి
  • వేతనంలో 90 శాతం కంపెనీ షేర్ల రూపంలోనే
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం రికార్డు స్థాయిలో పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఏకంగా 96.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 800 కోట్లకు పైగా) వేతన ప్యాకేజీని అందుకున్నారు. గత దశాబ్ద కాలంలో ఆయన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే అత్యధిక వేతనం కావడం విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కంపెనీ సాధించిన అసాధారణ విజయాలకు గుర్తింపుగానే ఆయన జీతాన్ని భారీగా పెంచినట్లు తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, నాదెళ్ల వేతనంలో అధిక భాగం షేర్ల రూపంలోనే ఉంది. ఆయన ప్రాథమిక వేతనం 2.5 మిలియన్ డాలర్లు కాగా, మిగిలిన 90 శాతం కంపెనీ షేర్ల రూపంలో అందుకోనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన 79.1 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ ఒక పెను మార్పునకు కారణమవుతోందని, ఈ కీలక సమయంలో సత్య నాదెళ్ల, ఆయన నాయకత్వ బృందం మైక్రోసాఫ్ట్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపారని కంపెనీ బోర్డు వాటాదారులకు తెలియజేసింది.

సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ షేరు విలువ ఈ ఏడాదిలోనే దాదాపు 23 శాతం పెరిగింది. ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి పోటీదారులను అధిగమిస్తూ కంపెనీకి చెందిన అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం నిలకడగా వృద్ధి చెందుతోంది. ఒకప్పుడు చిన్న స్టార్టప్‌గా ఉన్న ఓపెన్‌ఏఐలో ముందుచూపుతో పెట్టుబడులు పెట్టడం నాదెళ్లకు బాగా కలిసొచ్చింది. చాట్‌జీపీటీ సంచలనం సృష్టించడంతో మైక్రోసాఫ్ట్ ఆ సంస్థలో తన పెట్టుబడులను 10 బిలియన్ డాలర్లకు పైగా పెంచింది. ప్రస్తుతం ఆఫీస్ టూల్స్ నుంచి క్లౌడ్ సేవల వరకు దాదాపు అన్ని మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులలో ఓపెన్‌ఏఐ టెక్నాలజీని అనుసంధానించారు.

సత్య నాదెళ్ల వ్యూహాత్మక నిర్ణయాల వల్లే మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఏఐ రంగాల్లో అగ్రస్థానానికి చేరింది. లింక్డ్‌ఇన్, గిట్‌హబ్, యాక్టివిజన్ బ్లిజార్డ్ వంటి కీలక సంస్థలను కొనుగోలు చేసి సాఫ్ట్‌వేర్, గేమింగ్, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ రంగాల్లోనూ కంపెనీని విస్తరించారు. ఆయనతో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమీ హుడ్ 29.5 మిలియన్ డాలర్లు, కమర్షియల్ బిజినెస్ హెడ్ జడ్సన్ ఆల్తాఫ్ 28.2 మిలియన్ డాలర్ల వేతనాలు అందుకున్నారు.
Satya Nadella
Microsoft
Microsoft CEO
Artificial Intelligence
Azure Cloud
OpenAI
Tech Salary
Amy Hood
Judson Althoff

More Telugu News