FIFA World Cup: మెక్సికోలో ఫుట్‌బాల్ జాతర.. ప్రాణభయంతో సంపన్న పర్యాటకులు!

FIFA World Cup in Mexico Security Concerns for Tourists
  • 2026 ఫీఫా వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్న మెక్సికో
  • పర్యాటకులకు భద్రత కల్పించేందుకు బుల్లెట్‌ప్రూఫ్ కార్ల ఏర్పాటు
  • డ్రగ్ మాఫియా, అధిక నేరాల రేటుతో సంపన్నుల్లో ఆందోళన
  • రోజుకు రూ. లక్షల్లో బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల అద్దె
  • భద్రతా సిబ్బందినే టార్గెట్ చేస్తున్న నేర ముఠాలు
  • టోర్నీకి ఇబ్బంది ఉండదంటున్న భద్రతా నిపుణులు
2026 ఫీఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అమెరికా, కెనడాతో కలిసి మెక్సికో ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఈ మెగా టోర్నమెంట్ కోసం ఫుట్‌బాల్ అభిమానులు సిద్ధమవుతుంటే, మెక్సికోలోని భద్రతా సంస్థలు మాత్రం సంపన్న పర్యాటకులకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, సాయుధ రక్షణ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దేశంలో పేట్రేగిపోతున్న డ్రగ్ మాఫియా, నేరాల కారణంగా ఈ ప్రత్యేక సేవలకు భారీ డిమాండ్ ఏర్పడింది.

మెక్సికోలో ఏటా సుమారు 30,000 హత్యలు జరుగుతుండటంతో పర్యాటకులు, ముఖ్యంగా డబ్బున్నవారు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ భయాన్ని అవకాశంగా మలుచుకున్న సెక్యూరిటీ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. కేవలం బుల్లెట్‌ప్రూఫ్ కార్లే కాకుండా, బాంబుల నుంచి రక్షణ, సాయుధ అంగరక్షకులు, బుల్లెట్‌ప్రూఫ్ దుస్తులు వంటి సేవలను కూడా అందిస్తున్నాయి.

"మా దగ్గర డబ్బున్న పర్యాటకుల నుంచే బుకింగ్స్ వస్తున్నాయి. మెక్సికో గురించి చెడుగా వినడంతో వాళ్లు భయపడుతున్నారు" అని రుహే అనే సెక్యూరిటీ సంస్థ అధిపతి లియోపోల్డో సెర్డీరా తెలిపారు. వరల్డ్ కప్ కోసం ఆయన తన సంస్థలోని 70 బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల సంఖ్యను 80కి పెంచాలని యోచిస్తున్నారు.

మెక్సికో సిటీ, మాంటెర్రీ, గ్వాడలజారా నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో గ్వాడలజారా నగరం అత్యంత ప్రమాదకరమైన 'జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్' (సీజేఎన్‌జీ)కు అడ్డాగా ఉంది. ఈ ముఠాను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించి, దాని నాయకుడిపై 12 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది. దీంతో అధికారులు ఆ నగరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే రాజధానిలో 40,000 అదనపు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, మ్యాచ్‌లు జరిగే నగరాల్లో డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు విధించారు.

ఈ సెక్యూరిటీ వాహనాలకు రోజుకు 800 నుంచి 1,100 డాలర్ల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. డ్రైవర్, అంగరక్షకుల సేవలకు అదనపు ఛార్జీలు ఉంటాయి. మరోవైపు, డ్రగ్ మాఫియాలు కూడా 'మాన్‌స్టర్స్'గా పిలిచే సొంత బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను తయారు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా, అధిక జీతాలు ఆశ చూపి సెక్యూరిటీ సంస్థల్లోని సిబ్బందినే తమ ముఠాల్లోకి చేర్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే, ఈ డ్రగ్ ముఠాలు వరల్డ్ కప్‌కు నేరుగా ఎలాంటి ముప్పు కలిగించకపోవచ్చని భద్రతా సలహాదారు డేవిడ్ సౌసెడో అభిప్రాయపడ్డారు. "ఈ మ్యాచ్‌ల వల్ల వారి సామాజిక వర్గాలకు కూడా లబ్ధి చేకూరుతుంది. టోర్నమెంట్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు, మాఫియా ముఠాల మధ్య అనధికారిక ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉంది" అని ఆయన విశ్లేషించారు. ఇప్పటికే ఫీఫా ప్రతినిధులకు, మెక్సికన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రికి ఈ సంస్థలు భద్రతా సేవలు అందిస్తుండటం గమనార్హం.
FIFA World Cup
Mexico
World Cup 2026
football
security
drug cartels
tourism
crime
Guadalajara
Jalisco New Generation Cartel

More Telugu News