ప్రొద్దుటూరును క్యాసినో అడ్డాగా మార్చారు: రాచమల్లు సంచలన ఆరోపణలు

  • ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయన్న రాచమల్లు
  • క్యాసినో, మట్కా, బెట్టింగ్ విచ్చలవిడిగా సాగుతున్నాయని ఆరోపణ 
  • టీడీపీ నేతలే ఈ దందాలు నడుపుతున్నారన్న రాచమల్లు
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని, అధికార టీడీపీ నాయకులే ఈ వ్యవహారాలను నడిపిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పట్టణంలో క్యాసినో, మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి జూద క్రీడలు విచ్చలవిడిగా సాగుతున్నాయని ఆయన విమర్శించారు.

ఈ అక్రమ కార్యకలాపాలను టీడీపీకి చెందిన కీలక నాయకులే స్వయంగా నిర్వహిస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. గోవాలో క్యాసినోలు నడిపే వారే ఇక్కడ కూడా ఈ దందాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీలలో జూదం కోసం కడప నుంచి హైదరాబాద్ మీదుగా గోవాకు వెళ్లేందుకు ఇండిగో విమానంలో నిర్వాహకులు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారని ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. పట్టణంలో గంజాయి అమ్మకాలు పెరిగిపోయి యువత భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అక్రమాలతో పాటు, ప్రొద్దుటూరు కేంద్రంగా కొందరు టీడీపీ కౌన్సిలర్లు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని, నకిలీ మద్యం కూడా విరివిగా విక్రయిస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. "పేద ప్రజల రక్తాన్ని టీడీపీ నేతలు పీల్చేస్తున్నారు. ఈ అక్రమాలన్నీ పోలీసులకు తెలిసినా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్నారు" అని ఆయన అన్నారు.

యువత భవిష్యత్తును నాశనం చేసే ఈ కార్యకలాపాలను తక్షణమే ఆపాలని టీడీపీ నాయకులను డిమాండ్ చేశారు. జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ అయినా ఈ అక్రమాలపై దృష్టి సారించి, వాటిని అరికడతారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రొద్దుటూరులో శాంతిభద్రతలను కాపాడాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు. 


More Telugu News