ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా అండ.. వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీతో మంత్రి లోకేశ్‌ చర్చలు

  • ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేశ్‌
  • ఏపీ వ్యవసాయ ఆధునికీకరణకు సహకరించాలని వర్సిటీ యాజమాన్యానికి విజ్ఞప్తి
  • వాతావరణాన్ని తట్టుకునే పంటలు, స్మార్ట్ ఫార్మింగ్‌పై కలిసి పనిచేయాలని ప్రతిపాదన
  • ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీతో భాగస్వామ్యం కావాలని సూచన
  • ఏఐ, స్మార్ట్ ఇరిగేషన్ టెక్నాలజీలపైనా చర్చలు
  • రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సంయుక్త కార్యక్రమాలు చేపట్టాలని కోరిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి, రైతులను బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రఖ్యాత వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీని (డ‌బ్ల్యూఎస్‌యూ) సందర్శించి, వర్సిటీ సీనియర్ ప్రతినిధులు, వ్యవసాయ టెక్నాలజీ పరిశోధకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఏపీ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు తమతో కలిసి పనిచేయాలని లోకేశ్‌ వారికి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయాలి. వాతావరణ మార్పులను తట్టుకునే పంటల అభివృద్ధి, ప్రెసిషన్ ఫార్మింగ్ వంటి రంగాల్లో మీ నైపుణ్యాన్ని మా రైతులకు అందించాలి" అని కోరారు. స్మార్ట్ ఫార్మింగ్, అగ్రి-టెక్ ఆవిష్కరణలపై రైతులకు, వ్యవసాయ నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు సంయుక్త కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటులో సహకరించాలని కోరారు. రాష్ట్రంలో స్థిరమైన వ్యవసాయ విధానాల రూపకల్పనకు పరిశోధన ఆధారిత సూచనలు ఇవ్వాలని మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.

మంత్రి లోకేశ్ ప్రతిపాదనలపై వర్సిటీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. తమ విశ్వవిద్యాలయం స్థిరమైన అభివృద్ధిలో ప్రపంచంలోనే నంబర్ వ‌న్‌ స్థానంలో ఉందని (THE Impact Rankings 2023), ప్రపంచంలోని టాప్ 2 శాతం విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందిందని వారు వివరించారు. ఇప్పటికే ఐఐటీల వంటి భారతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. తమ అనుబంధ సంస్థ హాక్స్‌బరీ ఇన్ స్టిట్యూట్ ఫర్ ద ఎన్విరాన్‌మెంట్... భూసారం, నీటి యాజమాన్యం వంటి అంశాలపై విస్తృత పరిశోధనలు చేస్తోందన్నారు. ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) టెక్నాలజీలను ఉపయోగించి పంట దిగుబడులను పెంచడంపై దృష్టి సారించామని, ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు.



More Telugu News