Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ దీపావళి శుభాకాంక్షలు.. తీవ్రంగా మండిపడిన తమిళిసై

Udhayanidhi Stalins Diwali Wishes Spark Controversy with Tamilisai
  • డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలుసునన్న తమిళిసై
  • ఇతర మతాల వారికి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు అలాగే చెబుతారా అని ప్రశ్న
  • కేవలం విశ్వాసం ఉన్నవారికే అని చెప్పడమేమిటని నిలదీత
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ 'హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న వారికి దీపావళి శుభాకాంక్షలు' అని చెప్పడంపై ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ఆయన శుభాకాంక్షలు తెలిపిన తీరును ఆమె ఖండించారు. డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలుసని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతర మతాల పండుగల సమయంలో వారికి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు కేవలం విశ్వాసం ఉన్నవారికే అని ఆ పార్టీ నేతలు ఎప్పుడూ చెప్పలేదని ఆమె అన్నారు. హిందూ మతం విషయానికి వచ్చేసరికి వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

హిందుత్వంపై ఉదయనిధి స్టాలిన్‌కు ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని ఆమె అన్నారు. డీఎంకే పార్టీ హిందువులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు.

సోమవారం ఉదయనిధి స్టాలిన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రజలు తనకు దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి వెనకాడారని అన్నారు. తాను వేదిక పైకి చేరుకున్నప్పుడు చాలామంది తనకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారని, కొందరు దీపావళి శుభాకాంక్షలు చెప్పాలా, వద్దా అని సంకోచించారని అన్నారు. చెబితే తాను కోపం తెచ్చుకుంటానేమోనని భయపడ్డారని, కానీ తాను చెప్పేది ఒక్కటేనని, హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న వారందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Udhayanidhi Stalin
Tamilisai Soundararajan
Diwali wishes
DMK
Hindu Dharma
Tamil Nadu BJP
Hinduism

More Telugu News