Dawood Ibrahim: మళ్లీ తెరపైకి దావూద్ ఇబ్రహీం గ్యాంగ్... రూ.5 కోట్లు ఇవ్వాలంటూ క్రికెటర్ రింకూ సింగ్ కు బెదిరింపు

Dawood Ibrahim Gang resurfaces threatening cricketer Rinku Singh
  • డ్రగ్స్ దందాపై ప్రభుత్వం ఉక్కుపాదంతో డీ-గ్యాంగ్‌కు భారీ నష్టాలు
  • కోల్పోయిన పట్టును తిరిగి సాధించేందుకు దావూద్ కొత్త ప్లాన్
  • బెదిరింపులు, కిడ్నాప్‌ల కోసం దేశవ్యాప్తంగా ఎక్స్‌టార్షన్ సెల్స్ ఏర్పాటు
  • ఎన్సీపీ నేత కుమారుడి నుంచి రూ. 10 కోట్లు డిమాండ్
  • జల్లో మళ్లీ భయాన్ని సృష్టించి, పాత రోజులు తేవడమే లక్ష్యం
ఒకప్పుడు దేశాన్ని గడగడలాడించిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సామ్రాజ్యం మళ్లీ పంజా విసిరేందుకు ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపడంతో డీ-గ్యాంగ్ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. దీంతో పట్టు కోల్పోతున్న తన అండర్‌వరల్డ్ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునేందుకు దావూద్ కొత్త వ్యూహానికి తెరలేపినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు హెచ్చరిస్తున్నాయి. డ్రగ్స్ దందాకు బదులుగా ఇప్పుడు బెదిరింపులు, కిడ్నాప్‌ల ద్వారా ప్రజల్లో భయాన్ని పుట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

గత కొద్ది నెలలుగా డ్రగ్స్ రవాణాపై అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేయడంతో డీ-గ్యాంగ్ తీవ్ర నష్టాలను చవిచూసింది. దీంతో గ్యాంగ్‌లో చేరేందుకు యువత ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు పోలీసులు, రాజకీయ, సినీ వర్గాల్లో ఉన్న పలుకుబడి కూడా గణనీయంగా తగ్గిపోవడంతో దావూద్ నెట్‌వర్క్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి తన కార్యకలాపాలు సాగిస్తున్న దావూద్, తన అనుచరులతో కలిసి వ్యూహం మార్చాడు. డ్రగ్స్ వ్యాపారాన్ని తాత్కాలికంగా తగ్గించి, దేశవ్యాప్తంగా ఎక్స్‌టార్షన్ సెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు.

ఈ కొత్త వ్యూహంలో భాగంగా, ముఖ్యంగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలపై దృష్టి సారించారు. పేరున్న వ్యక్తులను కిడ్నాప్ చేయడం, ప్రముఖులను బెదిరించి భారీగా డబ్బు వసూలు చేయడం ద్వారా డబ్బు సంపాదించడమే కాకుండా, ప్రజల్లో తిరిగి పాత రోజుల్లోని భయాన్ని సృష్టించాలని చూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ప్రముఖ క్రికెటర్ రింకూ సింగ్‌ను రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ డీ-గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. అలాగే, దివంగత ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ కుమారుడు జీషాన్ సిద్దిఖీని కూడా రూ. 10 కోట్ల కోసం బెదిరించిన కేసులో ఇద్దరు నిందితులను ఇంటర్‌పోల్ సహాయంతో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అరెస్ట్ చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా దావూద్ ఆదేశాలతో నడుస్తున్న పలు ఎక్స్‌టార్షన్ ముఠాలను ఛేదించారు. సాజిద్ ఎలక్ట్రిక్‌వాలా, షబ్బీర్ సిద్దిఖీ వంటి వారిని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలన్నీ భారత్‌లో అండర్‌వరల్డ్‌ను పునరుద్ధరించేందుకు దావూద్ చేస్తున్న ప్రయత్నాలను స్పష్టం చేస్తున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు.
Dawood Ibrahim
Rinku Singh
Dawood gang
extortion
underworld
Indian cricket
Baba Siddique
Zeeshan Siddique
crime
Mumbai crime branch

More Telugu News