ఇన్ఫోసిస్ ఏపీకి పోతే పరిస్థితి ఏమిటి?: కుమారస్వామి ఆందోళన
- కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కుమారస్వామి తీవ్ర విమర్శలు
- పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం అవమానిస్తోందని మండిపాటు
- నారాయణమూర్తి దంపతులపై సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టిన వైనం
కులగణనలో పాల్గొనబోమంటూ తమ హక్కును వినియోగించుకున్నందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన అర్ధాంగి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అవమానించేలా మాట్లాడారని కుమారస్వామి ఆరోపించారు. "మీ అవసరం మాకు లేదు" అన్నట్లుగా పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
ఇదే తరహాలో, నగరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా ఆవేదన వ్యక్తం చేస్తే, ఆమె అబద్ధాలు చెబుతున్నారంటూ ప్రభుత్వంలోని నేతలు మాట్లాడటం దారుణమని కుమారస్వామి విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన పరోక్షంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఉద్దేశించినట్లు స్పష్టమవుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని కుమారస్వామి విమర్శించారు. కేవలం నిధుల కొరత కారణంగా పాత పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని ఆయన తప్పుబట్టారు.