Poorva Mathur: ఆసుపత్రుల్లో అంతుచిక్కని ఇన్ఫెక్షన్లు.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు!

Study Reveals IV Tubes Not Sole Cause of Hospital Blood Infections
  • దేశవ్యాప్తంగా 47 ఆసుపత్రుల్లో బ్లడ్ ఇన్ఫెక్షన్లపై అధ్యయనం
  • చాలా ఇన్ఫెక్షన్లకు ఐవీ ట్యూబులు కారణం కాదని వెల్లడి
  • అంతుచిక్కని మార్గాల ద్వారా రోగుల రక్తంలోకి చేరుతున్న బ్యాక్టీరియా
  • యాంటీబయాటిక్స్‌ను సైతం తట్టుకుంటున్న ప్రమాదకర క్రిములు
  • చికిత్స కోసం చేరిన ఏడు రోజుల్లోనే 60% మందికి ఇన్ఫెక్షన్ల ముప్పు
  • నవజాత శిశువుల వార్డుల్లోనే అత్యధికంగా ఇన్ఫెక్షన్ల రేటు
ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆసుపత్రుల్లోనే కొన్నిసార్లు ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. అయితే, ఇలాంటి వాటిలో చాలా ఇన్ఫెక్షన్లు ఇంట్రావీనస్ ట్యూబుల (ఐవీ ట్యూబ్స్) వల్లనే వస్తాయని అందరూ భావిస్తుండగా, అసలు కారణం వేరే ఉందని ఓ దేశవ్యాప్త అధ్యయనం తేల్చింది. ఆసుపత్రుల్లో రోగులకు సోకుతున్న తీవ్రమైన రక్త ఇన్ఫెక్షన్లలో చాలా వాటికి మూలాలు అంతుచిక్కడం లేదని, ఇది వైద్య రంగానికి పెను సవాల్ అని ఈ పరిశోధన స్పష్టం చేసింది.

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మైక్రోబయాలజీ ప్రొఫెసర్ పూర్వా మాథుర్ నేతృత్వంలో ఈ బృహత్తర అధ్యయనం జరిగింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్‌కతా సహా 25 నగరాల్లోని 47 ఆసుపత్రులలో (33 ప్రభుత్వ, 14 ప్రైవేట్) ఏడేళ్ల పాటు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. సాధారణంగా సెలైన్లు, మందులు ఎక్కించేందుకు ఉపయోగించే సెంట్రల్ లైన్స్ (సీఎల్) లేదా ఐవీ ట్యూబుల ద్వారానే ఇన్ఫెక్షన్లు వస్తాయని ఇప్పటివరకు భావించారు. కానీ, ఐసీయూలలో నమోదవుతున్న రక్త ఇన్ఫెక్షన్లలో దాదాపు 40 శాతం కేసులకు ఈ ట్యూబులతో సంబంధం లేదని (నాన్-సీఎల్) అధ్యయనంలో తేలింది.

అసలు ముప్పు ఎక్కడ?
శస్త్రచికిత్స గాయాలు, యూరినరీ కాథెటర్లు లేదా కొన్నిసార్లు రోగి సొంత జీర్ణాశయం, ఊపిరితిత్తులు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా కూడా బలహీనంగా ఉన్న సమయంలో రక్తంలోకి ప్రవేశించి ప్రమాదకరంగా మారుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఆసుపత్రిలో చేరిన ఏడు రోజుల్లోనే 60 శాతానికి పైగా రోగులు ఈ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. "ఐవీ ట్యూబుల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల నివారణపైనే ఇప్పటివరకు దృష్టి పెట్టాం. కానీ, ఇతర మార్గాల ద్వారా సోకుతున్న ఈ ఇన్ఫెక్షన్లను గుర్తించి, వాటిని అరికట్టే వ్యూహాలు అత్యవసరం" అని ప్రొఫెసర్ పూర్వా మాథుర్ తెలిపారు.

లొంగని బ్యాక్టీరియా.. పెరుగుతున్న ప్రమాదం
ఈ అధ్యయనంలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్న క్లెబ్సియెల్లా, అసినెటోబాక్టర్ వంటి బ్యాక్టీరియాలు శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌ను సైతం తట్టుకుంటున్నాయి. ముఖ్యంగా, అసినెటోబాక్టర్ కేసుల్లో 80 శాతం బ్యాక్టీరియా చివరి ప్రత్యామ్నాయంగా వాడే కార్బపెనెం వంటి యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగడం లేదని తేలింది. దీనివల్ల రోగులు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, చికిత్స ఖర్చు పెరగడంతో పాటు ప్రాణాపాయం కూడా సంభవిస్తోంది.

అన్ని విభాగాలతో పోలిస్తే, నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (నియోనాటల్ ఐసీయూ) ఈ ఇన్ఫెక్షన్ల రేటు అత్యధికంగా (ప్రతి 1000 రోగుల రోజులకు 4.8 కేసులు) ఉన్నట్లు ఈ అధ్యయనం హెచ్చరించింది. ఈ గుప్త ఇన్ఫెక్షన్ల మూలాలను కచ్చితంగా గుర్తించేందుకు మరిన్ని మెరుగైన పరీక్షా విధానాలు అవసరమని పరిశోధకులు సూచించారు.
Poorva Mathur
hospital infections
intravenous tubes
IV tubes
blood infections
Klebsiella
Acinetobacter
antibiotic resistance
healthcare
AIIMS Delhi

More Telugu News