Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. సిడ్నీలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్‌

Nara Lokesh invites investments in Andhra Pradesh at Sydney event
  • సిడ్నీలో హెచ్ఎస్‌బీసీ, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ భేటీ
  • ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణంపై పారిశ్రామికవేత్తలకు వివరణ
  • 16 నెలల కాలంలోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి
  • విశాఖపట్నం డేటా సిటీగా అభివృద్ధి చెందుతోందని స్పష్టీకరణ
  • నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే విశాఖ భాగస్వామ్య సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు అద్భుతమైన అవకాశాలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. సిడ్నీలో హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ సీఈఓ ఆంటోనీ షా నేతృత్వంలో పలు దిగ్గజ కంపెనీల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ విధానాలను ఆయన వారికి వివరించారు.

సీఎం చంద్రబాబు ప్రకటించిన పారిశ్రామిక విధానాల వల్ల రాష్ట్రం వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని లోకేశ్ తెలిపారు. కేవలం 16 నెలల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. "ఒకసారి మాతో ఒప్పందం చేసుకున్న తర్వాత, ఆ పరిశ్రమను మా సొంత సంస్థగా భావించి అవసరమైన అన్ని అనుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 1,051 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, పటిష్ఠ‌మైన రహదారులు, ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో ‘డేటా సిటీ’గా రూపాంతరం చెందనుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఉన్న సానుకూల పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఈ సమావేశంలో అమెజాన్, సిస్కో, ఎర్నెస్ట్ అండ్ యంగ్, హెచ్‌సీఎల్ టెక్, కేపీఎంజీ, మాస్టర్‌కార్డ్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు మెల్‌బోర్న్, సిడ్నీ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Nara Lokesh
Andhra Pradesh investments
AP industrial policy
Visakhapatnam data city
AP partnership summit
HSBC Bank
Amazon
Cisco
AP economic development
Invest in Andhra Pradesh

More Telugu News