Ayodhya Deepotsavam: అయోధ్య దీపోత్సవానికి గిన్నిస్ బుక్‌లో స్థానం

Ayodhya Deepotsavam Enters Guinness Book of Records
  • అయోధ్యలో కన్నులపండుగగా 9వ దీపోత్సవం 
  • సరయూ తీరంలో 26.17 లక్షల దీపాలు వెలిగించిన భక్తులు
  • ఒకే సారి 2,128 మంది భక్తుల హారతులు 
  • రామ్ కీ పైడీ ఘాట్ వద్ద స్వయంగా హారతి కార్యక్రమం నిర్వహించిన సీఎం యోగి
అయోధ్యలో వెలుగుల పండుగ శోభాయమానంగా జరిగింది. సరయూ నదీ తీరం దీపకాంతులతో వెలిగిపోగా, 9వ దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ ఏడాది మొత్తం 26.17 లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అదే విధంగా, ఒకేసారి 2,128 మంది భక్తులు హారతులు నిర్వహించడం కూడా మరో రికార్డుగా నమోదైంది. ఈ రెండు రికార్డులను గిన్నిస్ సంస్థ అధికారికంగా ధృవీకరించినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

దీపోత్సవం సందర్భంగా సరయూ నదీ తీరంలోని ఘాట్‌లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. రామ్‌లీలా ప్రదర్శనలు, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రామ్ కీ పైడీ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హారతిని నిర్వహించి రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలో కళాకారులు రథాన్ని లాగుతూ దీపోత్సవానికి శ్రీకారం చుట్టారు.

దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం నలుదిశలా దీపకాంతులతో ప్రకాశించింది. ఈ వేడుకల నేపథ్యంలో అయోధ్యలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

**భక్తుల తాకిడి పెరుగుతోంది**

రామమందిర ప్రారంభం తరువాత అయోధ్యకు భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. జనవరి నుండి జూన్ మధ్యకాలంలోనే 23.82 కోట్ల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వారిలో సుమారు 50 వేల మంది విదేశీయులు ఉన్నారు. 2017లో మొదటిసారిగా దీపోత్సవం నిర్వహించినప్పుడు 1.78 కోట్ల మంది మాత్రమే హాజరయ్యారు. ఈ ఏడాది ఆ సంఖ్య పది రెట్లు పెరిగి అయోధ్య పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. 
Ayodhya Deepotsavam
Deepotsavam
Ayodhya
Guinness World Record
Yogi Adityanath
Sarayu River
Ram Mandir
Uttar Pradesh
Tourism
Hindu Festival

More Telugu News