నిజామాబాద్‌లో ఘోరం... కానిస్టేబుల్‌ను పొట్టనబెట్టుకున్న నిందితుడు

  • కానిస్టేబుల్ ప్రమోద్‌పై నిందితుడు రియాజ్ కత్తితో దాడి
  • నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ వద్ద ఘటన
  • కానిస్టేబుల్ మృతి, మరో ఇద్దరు గాయపడిన వైనం
నిజామాబాద్ నగరంలో జరిగిన ఒక సంఘటన పోలీసు వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ద్విచక్ర వాహనం చోరీ చేసిన నిందితుడు ఏకంగా పోలీసులపైనే కత్తితో దాడి చేసి పరారైన ఉదంతం సంచలనంగా మారింది. ఈ దాడిలో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం, హాస్మీ కాలనీలో నివసించే రియాజ్ (24) ద్విచక్ర వాహనం దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం అందడంతో కానిస్టేబుల్ ప్రమోద్ (42) తన మేనల్లుడితో కలిసి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

రియాజ్‌ను బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతుండగా, మార్గమధ్యలో వినాయక్‌నగర్ వద్ద రియాజ్ ఆకస్మికంగా కత్తి తీసి ప్రమోద్ ఛాతీలో పొడిచాడు. అడ్డుకునే ప్రయత్నంలో అతని మేనల్లుడిపై కూడా దాడి చేశాడు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి రియాజ్‌ను తప్పించేందుకు ప్రయత్నించగా, అక్కడికి వచ్చిన సీసీఎస్ ఎస్ఐ విఠల్ వారిని అడ్డుకున్నారు. కానీ ఆయనపైన కూడా నిందితులు దాడి చేసి పరారయ్యారు. గాయాలతో బయటపడ్డ ఎస్ఐ విఠల్ ఈ విషయాన్ని సీఐ శ్రీనివాస్ రాజ్ దృష్టికి తీసుకువెళ్లారు.

సీసీఎస్ సీఐ శ్రీనివాస్‌రాజ్, పట్టణ నాల్గవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రమోద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమోద్ మేనల్లుడి పరిస్థితి నిలకడగా ఉంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన పోలీసు వర్గాల్లో విషాదాన్ని నింపింది. 


More Telugu News