దైవం విధించే శిక్ష నుంచి తప్పించుకోలేరు: నటి ప్రత్యూష తల్లి!

  • టీనేజ్ లోనే ఎంట్రీ ఇచ్చిన ప్రత్యూష 
  • 2002లో అనుమానాస్పద మృతి 
  • అప్పటి నుంచి పోరాడుతున్న తల్లి 
  • నేరస్థులు అనుభవిస్తారంటూ ఆవేదన

చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన ఆర్టిస్ట్ ప్రత్యూష. చక్కని కనుముక్కుతీరు కలిగిన ప్రత్యూష చాలా తక్కువ సమయంలో వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్లింది. ఆ తరువాత అనుమానాస్పద స్థితిలో మరణించింది. అప్పటి నుంచి నేరస్థులను శిక్షించాలంటూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి న్యాయ పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆమె ఈ విషయాన్ని గురించి 'సుమన్ టీవీ'తో మాట్లాడారు. 

"మా అమ్మాయి ప్రత్యూష 16 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చింది. చనిపోయినప్పుడు ఆమె వయసు 19 ఏళ్లు. 2002లో తనని చంపేశారు. అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాను. 'మా అమ్మాయిని చంపేశారు .. నాకు న్యాయం చేయండి' అనే మాటకే నేను కట్టుబడి ఉన్నాను. మా అమ్మాయిని చంపినవాళ్లు .. వాళ్ల కుటుంబ సభ్యులు నా కళ్లముందు నిస్సిగ్గుగా తిరుగుతున్నారు. వాళ్లలో ఎలాంటి బాధా లేదు. ఈ కేసు విషయంలో ఏమీ చేయలేకపోయినవాళ్లు తమని క్షమించమని నాతోనే అన్నారు" అని చెప్పారు. 

" మా పాప చావు బ్రతుకుల్లో ఉందని తెలిసినప్పుడు వెళ్లాను. అయితే ట్రీట్మెంట్ జరుగుతోందని చెప్పి నన్ను దగ్గరికి వెళ్లనీయలేదు. అక్కడి నుంచే రాజకీయాలు మొదలయ్యాయనే సంగతి నాకు ఆ తరువాత తెలిసింది. ఎప్పటికైనా చట్టం వాళ్లను శిక్షిస్తుంది .. నేను అది చూస్తాను. నాకు డబ్బు .. పలుకుబడి లేని కారణంగా ఒకవేళ వాళ్లు తప్పించుకోగలిగినా, ఆ దేవుడు విధించే శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరు" అని అన్నారు.    



More Telugu News