బీసీ రిజర్వేషన్ల పోరు.. తెలంగాణలో నిలిచిన బస్సులు

  • స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు బీసీల పట్టు
  • ‘బంద్‌ ఫర్‌ జస్టిస్‌’ పేరుతో తెలంగాణ బంద్‌కు పిలుపు
  • రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
  • బంద్‌కు బీఆర్‌ఎస్‌ సహా పలు పార్టీలు, సంఘాల మద్దతు
  • మూతపడిన దుకాణాలు.. స్తంభించిన జనజీవనం
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో తెలంగాణలో ఈరోజు బంద్ కొన‌సాగుతోంది. బీసీ సంఘాలు ‘బంద్‌ ఫర్‌ జస్టిస్‌’ పేరుతో ఇచ్చిన పిలుపునకు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. బంద్‌ ప్రభావంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోగా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సైతం ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

బంద్‌లో భాగంగా బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు తెల్లవారుజామున 4 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించి నిరసనలకు దిగారు. దీంతో ఒక్క బస్సు కూడా డిపోల నుంచి బయటకు రాలేదు. రాజధాని హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ సహా రాజేంద్రనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్‌ వంటి ప్రధాన డిపోలన్నీ బస్సులు లేక నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. జిల్లాలు, అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు బస్ డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగానే బీసీలకు రిజర్వేషన్లు అమలు కాలేదని ఆరోపించారు. నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్‌, సిరిసిల్ల, మెదక్‌ సహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ బంద్‌కు బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర రాజకీయ పక్షాలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా పూర్తి మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. మొత్తం మీద బంద్ విజయవంతం కావడంతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది.


More Telugu News