AP High Court: పోలీసులకు పౌరులను కొట్టడం అలవాటైంది.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: ఏపీ హైకోర్టు

AP High Court criticizes police behavior of hitting citizens
  • పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం
  • పౌరులను కొట్టడం అలవాటుగా మార్చుకున్నారని వ్యాఖ్య
  • 2016 నాటి కేసులో 8 ఏళ్లయినా దర్యాప్తు పూర్తికాలేదని అసహనం
  • కర్నూలు బాధితుడు ఇప్పటికీ నడవలేని దుస్థితి
  • హైకోర్టు డ్రైవర్‌పై దాడి ఘటన ప్రస్తావన
  • కోర్టు ఆదేశాలతోనే ఫైనల్ రిపోర్ట్ దాఖలు
రాష్ట్రంలో పోలీసుల వైఖరిపై ఏపీ హైకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. పౌరులను అక్రమంగా నిర్బంధించడం, వారిపై దాడి చేయడం పోలీసులకు ఒక అలవాటుగా మారిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. నిందితులపై హత్య కేసు లేదా దొంగతనం కేసు నమోదు చేసినా, చట్టప్రకారం నడుచుకోవాలే తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది.

కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిన గొల్ల జయపాల్ యాదవ్‌ను 2016లో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టారని, ఆ దెబ్బల కారణంగా బాధితుడు ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటికీ సరిగా నడవలేని దుస్థితిలో ఉన్నాడని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. తనను చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జయపాల్ 2016లో ఫిర్యాదు చేస్తే, ఇన్నేళ్లయినా ఆ కేసులో తుది నివేదిక దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పోలీసుల పనితీరును ఉదహరిస్తూ న్యాయమూర్తి మరో ఘటనను గుర్తుచేశారు. "ఇటీవల హైకోర్టులో పనిచేసే డ్రైవర్‌పై మంగళగిరి సీఐ దాడి చేశారు. మేము జోక్యం చేసుకుని జిల్లా ఎస్పీని పిలిపించి మాట్లాడితే తప్ప కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత స్వయంగా డీజీపీతో మాట్లాడటంతో దర్యాప్తు అధికారిని నియమించి, ఆ సీఐని వీఆర్‌కు పంపారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఈ విధంగా ఉంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

జయపాల్ కేసులో కర్నూలు ఎస్పీ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించిన తర్వాతే, ఈ నెల 14న పోలీసులు సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసును మూసివేయాలని పోలీసులు భావిస్తే, ఆ విషయాన్ని కోర్టుకు తెలిపి, న్యాయస్థానం ఆమోదం పొందాలని సూచించారు.

ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ, తుది నివేదిక కాపీని పిటిషనర్‌కు అందజేయాలని ఆదేశించారు. అదే సమయంలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
AP High Court
Andhra Pradesh High Court
police misconduct
police brutality
Kurnool
Golla Jayapal Yadav
illegal detention
Mangalagiri CI
Vikrant Patil
Justice Battu Devanand

More Telugu News