జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక... అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన

  • మజ్లిస్ పార్టీ పోటీ చేయడం లేదన్న అసదుద్దీన్ ఒవైసీ
  • బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు వెల్లడి
  • పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని విమర్శ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో మజ్లిస్ పార్టీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ శుక్రవారం ఒవైసీని కలిశారు. నవీన్ యాదవ్‌తో పాటు పార్టీ సీనియర్ నాయకుడు అజారుద్దీన్ కూడా ఉన్నారు. అజారుద్దీన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉందని, ఈ కాలంలో జూబ్లీహిల్స్ నుంచి ఆ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేగా ఉన్నారని, కానీ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. నియోజకవర్గంలోని 3.98 లక్షల మంది ఓటర్లు ఇప్పుడు అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. ఈ నియోజకవర్గంలో అనేక మురికివాడలు ఉన్నాయని, అన్ని వార్డులలో పౌర సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇప్పుడు వచ్చిన ఉప ఎన్నిక ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మంచి అవకాశంగా ఆయన అభిప్రాయపడ్డారు. 2023లో బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్‌కు టిక్కెట్ ఇవ్వకపోయి ఉంటే ఈ ఉప ఎన్నిక వచ్చి ఉండేది కాదని అన్నారు. గోపీనాథ్ అనారోగ్యంతో ఉన్నారనే విషయం 2023 నుంచి తెలుసని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగాలని నవీన్ యాదవ్‌కు అసదుద్దీన్ సూచించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నవీన్ యాదవ్‌కు టిక్కెట్ ఇచ్చింది. నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేశారు.

కాగా, గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయినట్లు అసదుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత 5 నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయిందని అసదుద్దీన్ గుర్తు చేశారు.

నవీన్ యూదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2018లో నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ, ఆ పార్టీ అజారుద్దీన్‌కు టిక్కెట్ కేటాయించింది. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు.


More Telugu News