అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయాలి: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులపై కర్ణాటక సీఎం

  • కర్ణాటకలో సామాజిక, ఆర్థిక సర్వేపై నారాయణమూర్తి దంపతులు అర్థం చేసుకోలేకపోతున్నారని వ్యాఖ్య
  • రాష్ట్రంలో జరుగుతున్న సర్వేపై ఆ దంపతులకు కొన్ని అపోహలు ఉన్నాయన్న సిద్ధరామయ్య
  • నారాయణమూర్తి దంపతులు భావిస్తున్నట్లు ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదన్న ముఖ్యమంత్రి
కర్ణాటకలో కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక సర్వేను నారాయణమూర్తి దంపతులు అర్థం చేసుకోలేకపోతే తానేమీ చేయలేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సర్వేపై ఆ దంపతులకు కొన్ని అపోహలున్నాయని, ఇది వెనుకబడిన వర్గాల సర్వే అనే అభిప్రాయంతో వారు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక సర్వేను ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు తిరస్కరిస్తూ, తమది వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబం కాదని, ఈ సమీక్షలో పాల్గొనడం వల్ల కమిషన్‌కు లేదా ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని అన్నారు. దీనిపై సిద్ధరామయ్య స్పందించారు.

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు భావిస్తున్నట్లుగా ఇది వెనుకబడిన తరగతుల సర్వే కాదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇది ఏడు కోట్ల జనాభా సర్వే అని ఇప్పటికి ఇరవై సార్లు చెప్పామని అన్నారు. వారు ఏది కావాలంటే అది రాసుకోనివ్వండని, ఈ సర్వే దేని గురించో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. నారాయణమూర్తి దంపతులు అర్థం చేసుకోకుంటే తానేం చేయగలనని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నెలకు రూ. 2 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఈ పథకాల్లో అగ్రవర్ణ మహిళలు, దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న మహిళలులేరా అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. ఈ సర్వేపై పలుమార్లు ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చినప్పటికీ వారి అపోహలు తొలగిపోలేదని ఆయన అన్నారు. కేంద్రం ఇప్పుడు కులగణనతో ముందుకు వస్తుందని, దీనిపై నారాయణమూర్తి దంపతులు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.


More Telugu News