‘సామ్రాజ్యం’ ప్రోమో వదిలిన ఎన్టీఆర్.. చివర్లో శింబు ఊహించని డైలాగ్!

  • కోలీవుడ్‌లో శింబు, వెట్రిమారన్ కాంబోలో ‘అరసన్’ చిత్రం
  • తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో రానున్న సినిమా
  • చిత్ర తెలుగు ప్రోమోను విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్
"నా కథను ఎన్టీఆర్‌తో తీయించండి.. ఆయనైతే కుమ్మేస్తాడు" అంటూ ఓ తమిళ హీరో తన సినిమాలో చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆసక్తికరంగా, ఈ డైలాగ్ ఉన్న సినిమా ప్రోమోను స్వయంగా యంగ్ టైగర్ ఎన్టీఆరే విడుదల చేయడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. కోలీవుడ్ స్టార్ శింబు, జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అరసన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన దాదాపు 4 నిమిషాల నిడివి ఉన్న తెలుగు ఇంట్రో ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తర చెన్నై నేపథ్యంలోని గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రోమో ఆద్యంతం అద్భుతంగా ఉంది. ఓ హత్య కేసులో నిందితుడిగా కోర్టుకు వచ్చిన హీరో, జడ్జి ముందు అమాయకంగా నటిస్తూనే, మరోవైపు ముగ్గురిని దారుణంగా నరికివేసే సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. దీనికి అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం మరింత బలాన్నిచ్చింది.

ఈ ప్రోమోలో ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కనిపించడం కూడా ఓ ఆకర్షణగా నిలిచింది. అయితే, అందరి దృష్టిని ఆకర్షించిన అసలు విషయం ప్రోమో చివర్లో ఉంది. మీడియా ప్రతినిధులు తన కథ గురించి అడగ్గా, శింబు చెప్పిన "నా స్టోరీని ఎవరితో చేయిద్దామనుకుంటున్నారు.. ఎన్టీఆర్‌తో చేయించండి కుమ్మేస్తాడు" అనే డైలాగ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ అనూహ్యమైన డైలాగ్‌తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ, ఈ ప్రోమోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. 


More Telugu News