Singareni Workers: సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా.. ఖాతాల్లోకి దీపావళి బోనస్ జమ

Telangana Singareni Workers Get Diwali Bonus Plus Dasara Bonus
  • సింగరేణి కార్మికులకు దీపావళి కానుక
  • ఒక్కొక్కరి ఖాతాలో రూ. 1.03 లక్షల బోనస్ జమ
  • కేంద్రం ప్రకటించిన పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు
  • గతేడాదితో పోలిస్తే రూ. 9,250 అదనపు ప్రయోజనం
  • కోల్ ఇండియా చరిత్రలోనే ఇది రికార్డు స్థాయి బోనస్
తెలంగాణ సింగరేణి కార్మికులకు పండుగల వేళ డబుల్ ధమాకా తగిలింది. ఇటీవలే దసరా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ బోనస్ అందుకున్న వారికి, ఇప్పుడు దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం నుంచి మరో పెద్ద మొత్తం అందింది. కేంద్రం ప్రకటించిన పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు (పీఎల్ఆర్) కింద ఒక్కో కార్మికుడికి రూ. 1.03 లక్షల బోనస్ ఈరోజు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా ఏటా అందించే ఈ పీఎల్ఆర్ బోనస్, ఈసారి రికార్డు స్థాయిలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే రూ. 9,250 పెంచి, ఒక్కొక్కరికి రూ. 1.03 లక్షలు చెల్లిస్తున్నారు. కోల్ ఇండియా చరిత్రలోనే కార్మికులకు ఇంత భారీ మొత్తంలో పీఎల్ఆర్ బోనస్ ప్రకటించడం ఇదే ప్రథమం కావడం విశేషం. 2010-11 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 21,000గా ఉన్న ఈ బోనస్, క్రమంగా పెరుగుతూ ఈ ఏడాది లక్ష రూపాయల మార్కును దాటింది.

నెల రోజుల వ్యవధిలోనే సింగరేణి కార్మికులు రెండు భారీ బోనస్‌లు అందుకోవడంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సంస్థ లాభాల్లో 34 శాతం వాటాను కార్మికులకు పంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు 41,000 మంది శాశ్వత ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ. 1.95 లక్షలకు పైగా దసరా కానుకగా అందించింది. దీనికి అదనంగా ఇప్పుడు కేంద్రం నుంచి దీపావళి బోనస్ కూడా రావడంతో కార్మికులు పండుగలను మరింత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.

దసరా బోనస్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రూ. 5,500 చొప్పున చెల్లించడం గమనార్హం. కోల్ ఇండియా నుంచి వచ్చే పీఎల్ఆర్ బోనస్‌ను దీపావళికి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించిన ప్రకారమే, నేడు ఆ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేసింది.
Singareni Workers
Singareni Collieries Company Limited
Singareni
Telangana
Coal India
bonus
PLR
Deepavali bonus
Dasara bonus
coal workers
contract workers

More Telugu News