Madhavireddy: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Madhavireddy Setback in High Court Kadapa Municipal Case
  • మాధవిరెడ్డి అప్పీల్‌ను కొట్టేసిన హైకోర్టు
  • మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను రద్దు చేసే అధికారం కమిషనర్‌కు లేదన్న హైకోర్టు
  • సింగిల్ జడ్జి తీర్పు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడిన ధర్మాసనం 
కడప టిడిపి ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ వ్యవహారానికి సంబంధించి ఆమె దాఖలు చేసిన అప్పీల్ ను హైకోర్టు కొట్టివేసింది. మున్సిపల్ కార్పోరేషన్ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను రద్దు చేసే అధికారం కమిషనర్‌కు లేదని, రాష్ట్ర ప్రభుత్వానికే ఆ అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
 
ఈ ఏడాది జూన్‌ 20న కార్పొరేషన్‌ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌పై నిన్న హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌. రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం కేసు విచారణ జరిపి తీర్పు ఇచ్చింది.
 
తీర్మానాలను రద్దు చేస్తూ, కొత్త తేదీల్లో సమావేశం నిర్వహించాలని సూచిస్తూ కడప మున్సిపల్‌ కమిషనర్‌ జూన్‌ 30, జూలై 1 తేదీల్లో ఇచ్చిన నోటీసులను అప్పటి మేయర్‌ సురేశ్‌బాబు హైకోర్టులో సవాలు చేశారు. విచారణ అనంతరం సింగిల్‌ జడ్జి కమిషనర్‌కు తీర్మానాలను రద్దు చేసే అధికారం లేదని స్పష్టం చేస్తూ, జూన్‌ 20న చేసిన తీర్మానాలను అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మాధవిరెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్‌కి అప్పీల్‌ చేశారు. ఆమె తరఫు న్యాయవాది జవ్వాజి శరత్‌చంద్ర వాదనలు వినిపిస్తూ సమావేశానికి ఎక్స్‌అఫీషియో సభ్యురాలైన ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వలేదని, ఆ కారణంగా తీర్మానాలు చెల్లవని వాదించారు.

అయితే సురేశ్‌బాబు తరఫు న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ సమావేశంలో ప్రజాహిత తీర్మానాలే చేసినట్లు తెలిపారు. తీర్మానాలు చేసి నెలలు గడుస్తున్నా కమిషనర్, కార్పొరేటర్ల నుంచి ప్రభుత్వానికి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని, కాబట్టి సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, మాధవిరెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది.
Madhavireddy
Kadapa
Andhra Pradesh
High Court
Municipal Corporation
Suresh Babu
TDP
Municipal Commissioner
AP High Court

More Telugu News