LIC: ఎల్ఐసీ నుంచి మహిళల కోసం ప్రత్యేక పాలసీ.. తక్కువ కాలం ప్రీమియం.. ఎక్కువ ప్రయోజనాలు!

LIC Bima Lakshmi New Policy Benefits for Women
  • ఎల్ఐసీ నుంచి రెండు కొత్త బీమా పాలసీల ప్రారంభం
  • మహిళల కోసం ప్రత్యేకంగా 'బీమా లక్ష్మి' 
  • సాధారణ ప్రజల కోసం 'జన సురక్ష'
  • బీమాతో పాటు పొదుపు, గ్యారెంటీ రాబడి ప్రయోజనాలు
  • కనీస బీమా హామీ రూ. 2 లక్షలు, గరిష్ఠ పరిమితి లేదు
  • ఏటా ప్రీమియంపై 7 శాతం గ్యారెంటీ అడిషన్స్
దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ రెండు సరికొత్త పాలసీలను మార్కెట్లోకి విడుదల చేసింది. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని 'జన సురక్ష' (ప్లాన్ 880), ప్రత్యేకంగా మహిళల కోసం 'బీమా లక్ష్మి' (ప్లాన్ 881)ని అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ పాలసీలపై జీఎస్టీని తొలగించిన తర్వాత వీటిని తీసుకురావడం గమనార్హం. ముఖ్యంగా మహిళల ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చేలా రూపొందించిన 'బీమా లక్ష్మి' ప్లాన్ భారీ ప్రయోజనాలను అందిస్తోంది.

'బీమా లక్ష్మి' అనేది మార్కెట్‌తో సంబంధం లేని (నాన్-లింక్డ్) ప్లాన్. ఇది జీవిత బీమా కవరేజీతో పాటు క్రమం తప్పని పొదుపును ప్రోత్సహిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న మహిళలకు ఏటా తాము చెల్లించే ప్రీమియంపై 7 శాతం చొప్పున గ్యారెంటీ అడిషన్స్ లభిస్తాయి. పాలసీ వ్యవధి ముగిశాక మెచ్యూరిటీ ప్రయోజనాలతో పాటు ఈ హామీ మొత్తం కూడా అందుతుంది.

ఈ పాలసీలో చేరడానికి కనీస వయసు 18 ఏళ్లు కాగా, గరిష్ఠ వయోపరిమితి 50 ఏళ్లుగా నిర్ణయించారు. పాలసీ కాలపరిమితి 25 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, ప్రీమియం చెల్లించే వ్యవధిని మాత్రం 7 నుంచి 15 సంవత్సరాల మధ్య ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. కనీస బీమా హామీ (సమ్ అష్యూర్డ్) రూ. 2 లక్షలు ఉండగా, గరిష్ఠ పరిమితి అంటూ ఏదీ లేదు. పాలసీదారులు తమ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ఎంత మొత్తానికైనా పాలసీ తీసుకోవచ్చు. తమకు నచ్చినట్లుగా రూ.10 లక్షలు, రూ.20 లక్షలు, రూ.50 లక్షలు అంటూ ఎంతైనా ఎంచుకోవచ్చు. అయితే, దానికి తగినట్లుగానే ప్రీమియం కట్టాల్సి ఉంటుంది.

ఈ ప్లాన్‌లో కొన్ని పరిమిత ఆరోగ్య చికిత్సలకు కూడా కవరేజీ ఉంటుంది. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా మహిళల కోసం ప్రత్యేకంగా 'క్రిటికల్ కేర్ రైడర్' వంటివి కూడా జోడించుకోవచ్చు. పాలసీ ప్రారంభమైన మూడేళ్ల తర్వాత 'ఆటో కవర్' సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది. జీవిత బీమా, పొదుపు, సర్వైవల్ బెనిఫిట్స్ వంటి ప్రయోజనాలతో మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేలా ఈ పాలసీని ఎల్ఐసీ తీర్చిదిద్దింది.
LIC
LIC Bima Lakshmi
Bima Lakshmi
LIC policy for women
insurance policy
women's financial security
Jana Suraksha
LIC Plan 881
life insurance
investment

More Telugu News