H-4 EAD Visa: అమెరికాలోని భారత టెక్కీలకు శుభవార్త.. హెచ్-4 వీసాదారులకు భారీ ఊరట

H4 Visa Holders Get Relief as US Supreme Court Rejects Petition
  • హెచ్-4 వీసాదారుల ఉద్యోగ హక్కుపై అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
  • ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరణ
  • దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న న్యాయపోరాటానికి ముగింపు
  • ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన విధానానికి లభించిన చట్టపరమైన భరోసా
  • వేలాది భారతీయ టెక్ కుటుంబాలకు దక్కిన భారీ ఊరట
అమెరికాలో నివసిస్తున్న వేలాది భారతీయ టెక్ నిపుణుల కుటుంబాలకు శుభవార్త అందింది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు (హెచ్-4 వీసా హోల్డర్లు) అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే హక్కును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి యూఎస్ సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న న్యాయపోరాటానికి తెరపడినట్లయింది. ఈ నిర్ణయంతో వేలాది భారతీయ కుటుంబాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయి, వారిలో ఆనందం వెల్లివిరిసింది.

హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించే 'హెచ్-4 ఈఏడీ' (ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ 'సేవ్ జాబ్స్ యూఎస్ఏ' అనే సంస్థ చాలా కాలంగా న్యాయపోరాటం చేస్తోంది. ఈ విధానం వల్ల అమెరికన్ల ఉద్యోగావకాశాలు దెబ్బతింటున్నాయని ఆ సంస్థ వాదిస్తోంది. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. ఫలితంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో ఉంటుంది. అంటే హెచ్-4 వీసాదారుల‌ ఉద్యోగ హక్కు ఇకపై కూడా కొనసాగుతుంది.

2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుని, ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇది ఒక వరంలా మారింది. ఈ సదుపాయం లేకపోతే గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు వారు ఖాళీగా ఉండాల్సి వచ్చేది. హెచ్-4 వీసాదారుల్లో అత్యధికులు ఉన్నత విద్యావంతులు, నైపుణ్యం కలిగిన భారతీయ మహిళలే కావడం గమనార్హం. ఈఏడీ విధానం వ‌ల్ల‌ వారు అమెరికాలో తమ కెరీర్‌లను కొనసాగించగలుగుతున్నారు. అనేక మంది పెద్ద కంపెనీలలో ఉన్నత స్థానాల్లో స్థిరపడగా, మరికొందరు సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభించారు.

గతంలో డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీంతో చాలా కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంతో చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయినప్పటికీ, భవిష్యత్తులో రాజకీయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం లేకపోలేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ నిర్ణయం అమెరికాలోని భారతీయ వృత్తి నిపుణులకు, వారి కుటుంబాలకు గొప్ప స్థైర్యాన్ని ఇచ్చింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
H-4 EAD Visa
H1B Visa
Indian techies USA
USA jobs
Employment Authorization Document
Save Jobs USA
Barack Obama
Donald Trump
US Supreme Court
Green Card

More Telugu News