ఐఫోన్ 17 ఉందా? ఈ దీపావళికి అద్భుతమైన ఫోటోలు తీయండిలా.. నిపుణుల చిట్కాలు

  • ఐఫోన్ 17 సిరీస్‌తో దీపావళి ఫోటోగ్రఫీకి నిపుణుల సూచనలు
  • దీపాల ఫోటోలకు నైట్ మోడ్, తక్కువ ఎక్స్‌పోజర్ ఉత్తమం
  • పోర్ట్రెయిట్, సినిమాటిక్ మోడ్‌లతో పండుగ క్షణాలను బంధించండి
  • సహజమైన పోర్ట్రెయిట్స్ కోసం 2x లేదా 4x జూమ్ వాడకం
  • రాత్రిపూట స్పష్టమైన చిత్రాలకు ఫోన్‌ను స్థిరంగా ఉంచడం ముఖ్యం
దీపాల పండుగ దీపావళి వచ్చేసింది. ఈ పండుగ సందర్భంగా వెలిగించే దీపాలను, కుటుంబ సభ్యుల ఆనంద క్షణాలను అందంగా ఫోటోలు తీయాలని అందరూ ఆరాటపడతారు. ముఖ్యంగా కొత్తగా విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు ఉన్నవారు తమ కెమెరా సత్తాను పరీక్షించాలనుకుంటారు. అయితే, దీపాల వెలుగులో ఫొటోలు తీసేటప్పుడు కొన్నిసార్లు అవి ప్రకాశవంతంగా మారి, అసలు అందమే దెబ్బతింటుంది. ఈ సమస్యను అధిగమించి, అద్భుతమైన ఫోటోలు తీసేందుకు ప్రముఖ భారతీయ ఫొటోగ్రఫీ నిపుణులు కొన్ని విలువైన చిట్కాలను పంచుకున్నారు.

నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ప్రముఖ ఫొటోగ్రాఫర్ బాబీ రాయ్ ప్రకారం.. ఐఫోన్ 17 సిరీస్‌లోని ‘నైట్ మోడ్’ దీపాల ఫొటోలను అద్భుతంగా చిత్రీకరించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌లో ఉండే 48MP HEIF MAX సెట్టింగ్‌తో పండుగ అలంకరణలు, దీపకాంతుల సూక్ష్మ వివరాలను కూడా స్పష్టంగా బంధించవచ్చని ఆయన తెలిపారు. 

పూజల సమయంలో వ్యక్తుల ఫొటోలను మృదువుగా, సినిమాటిక్‌గా తీయడానికి ‘పోర్ట్రెయిట్ మోడ్’ వాడాలని సూచించారు. దీపాలు వెలిగించడం వంటి కదిలే దృశ్యాలను ‘సినిమాటిక్ మోడ్’లో వీడియో తీస్తే అద్భుతంగా ఉంటుందన్నారు. ఫొటోలలో దీపావళికి ప్రత్యేకమైన బంగారు వర్ణం ఉట్టిపడాలంటే, ఫొటో సెట్టింగ్స్‌లో కలర్ టెంపరేచర్ (warmth), ప్రకాశాన్ని (vibrancy) కొద్దిగా పెంచాలని సలహా ఇచ్చారు. దీపాల ఫొటోలు తీసేటప్పుడు ఫ్లాష్ ఆఫ్ చేసి, ఎక్స్‌పోజర్‌ను తగ్గించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన వివరించారు.

పోర్ట్రెయిట్స్ కోసం ప్రత్యేక సూచనలు
మరో ఫొటోగ్రాఫర్ పోరస్ విమాదలాల్ చెప్తున్నదాని ప్రకారం.. వ్యక్తుల ఫొటోలు (పోర్ట్రెయిట్స్) తీసేటప్పుడు కొన్ని ప్రత్యేక మెలకువలు పంచుకున్నారు. పోర్ట్రెయిట్స్ తీసేటప్పుడు 2x లేదా 4x జూమ్ వాడటం వల్ల ముఖాలు వంకరగా కనిపించకుండా, మరింత సహజంగా కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఫొటో తీసే ముందు స్క్రీన్‌పై ట్యాప్ చేసి ఫోకస్ చేసి, ఎక్స్‌పోజర్‌ను కొద్దిగా తగ్గిస్తే సినిమాటిక్ లుక్ వస్తుందని తెలిపారు. వెలుగు వస్తున్న దిశకు 45 డిగ్రీల కోణంలో సబ్జెక్ట్‌ను ఉంచి ఫొటో తీస్తే, చిత్రానికి లోతు చేకూరి అందంగా కనిపిస్తుందన్నారు. రాత్రిపూట ఫొటోలు తీసేటప్పుడు చేతులు కదలకుండా ఫోన్‌ను స్థిరంగా ఉంచడం చాలా ముఖ్యమని, అవసరమైతే చిన్న ట్రైపాడ్ వాడటం మేలని ఆయన సూచించారు.

ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్‌లో అత్యాధునిక 48ఎంపీ కెమెరాలు, కొత్త టెట్రాప్రిజమ్ డిజైన్‌తో కూడిన టెలిఫోటో లెన్స్, 8x వరకు ఆప్టికల్ జూమ్ వంటి ఫీచర్లు ఉండటం వల్లే ఈ చిట్కాలతో అత్యుత్తమ ఫొటోలు తీయడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.


More Telugu News