సీఎం రేవంత్ తో విభేదాలు లేవు... ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తామన్నారు: కొండా మురళి

  • మంత్రి సురేఖ ఓఎస్డీ అరెస్టుకు పోలీసుల యత్నంపై స్పందన
  • వైఎస్ఆర్ తర్వాత అంతటి నేత రేవంత్ రెడ్డేనని వ్యాఖ్య
  • తన కుమార్తె వ్యాఖ్యల గురించి తనకు తెలియదన్న మురళి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తమ కుటుంబానికి ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. తమ నివాసంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ఈరోజు వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ వివాదాలను ఎవరో సృష్టిస్తున్నారని, దానికి తాను బాధ్యుడిని కాదని ఆయన అన్నారు.

వివరాల్లోకి వెళ్తే, మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న రాత్రి ఆమె నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ హైడ్రామా నడిచింది. ఈ ఘటనపై మంత్రి కుమార్తె సుస్మిత కూడా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా మురళి వివరణ ఇచ్చారు. "వరంగల్‌లో పార్టీ మీటింగ్ ఉండడంతో ఇక్కడికి వచ్చాను. ఇంట్లో ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. సురేఖ కూడా సమావేశానికి వస్తున్నారు" అని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మురళి పేర్కొన్నారు. "దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత తెలంగాణకు అంతటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని మేము భావించాం. ఆయనే సీఎం కావాలని కోరుకున్నాం. నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు" అని మురళి గుర్తుచేశారు.

తాను ఇప్పటివరకు సెక్రటేరియట్‌కు ఒక్కసారి కూడా వెళ్లలేదని, భవిష్యత్తులో కూడా వెళ్లనని కొండా మురళి స్పష్టం చేశారు. కేవలం కొండా సురేఖ ఛాంబర్ వాస్తు చూడటానికి మాత్రమే ఒకసారి వెళ్లానని చెప్పారు. "నాకు ఏమైనా అవసరం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇళ్లకే వెళ్తాను. వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాత్రం ఆయన వెంట వెళ్లేవాడిని" అని అన్నారు. తన కుమార్తె సుస్మిత వ్యాఖ్యల గురించి అడగ్గా, "నా బిడ్డ లండన్‌లో పెరిగింది. ఆమెకు ఏ పదవి లేదు, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆమె ఏం మాట్లాడిందో నాకు తెలియదు. నాకు ఫోన్ కూడా చూడటం రాదు" అని తెలిపారు.


More Telugu News