హిందీ నిషేధంపై పుకార్లు.. స్పష్టతనిచ్చిన తమిళనాడు ప్రభుత్వం

  • తమిళనాట హిందీ భాష వినియోగంపై నిషేధం అంటూ ప్రచారం
  • అసెంబ్లీలో బిల్లు పెట్టనున్నారంటూ జాతీయ మీడియాలో కథనాలు
  • దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన వార్త
  • పుకార్లను తీవ్రంగా ఖండించిన తమిళనాడు ప్రభుత్వం
  • అలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేసిన అసెంబ్లీ కార్యదర్శి
తమిళనాడులో హిందీ భాష వినియోగాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుందంటూ నిన్న‌ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన వార్తలపై స్టాలిన్ సర్కార్ స్పష్టతనిచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. హిందీని నిషేధించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని అధికారికంగా ప్రకటించి, ఈ వివాదానికి ముగింపు పలికింది.

వివరాల్లోకి వెళితే... తమిళనాడులో హిందీ హోర్డింగులు, బోర్డులు, సినిమాలు, పాటల్లో ఆ భాష వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు డీఎంకే ప్రభుత్వం సిద్ధమవుతోందంటూ బుధవారం జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో మరో ఏడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, నూతన విద్యా విధానంపై కేంద్రంతో ఇప్పటికే వివాదం నడుస్తుండటంతో ఈ వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాంతీయ భాషలపై హిందీని రుద్దుతున్నారనే దానికి ప్రతిస్పందనగానే ఈ చర్య అని డీఎంకే వర్గాలు చెప్పినట్లు వార్తలు రావడంతో చర్చ మరింత ఊపందుకుంది.

ఈ పరిణామం వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషణలు వెల్లువెత్తాయి. బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకేను ఇరకాటంలో పెట్టేందుకే సీఎం స్టాలిన్ ఈ ఎత్తుగడ వేశారని ప్రచారం జరిగింది. ఒకవేళ బిల్లు అసెంబ్లీకి వస్తే, అన్నాడీఎంకే మద్దతిస్తే బీజేపీతో విభేదాలు వస్తాయి, వ్యతిరేకిస్తే సొంత రాష్ట్రంలో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే, ఈ వార్తలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బుధవారం రాత్రి ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. ‘టీఎన్ ఫ్యాక్ట్ చెక్’ అనే ప్రభుత్వ అధికారిక సామాజిక ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. హిందీ భాష నిషేధానికి సంబంధించిన బిల్లు ప్రతిపాదన ఏదీ తమకు అందలేదని తమిళనాడు శాసనసభ కార్యదర్శి స్పష్టం చేశారని ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఒక్కరోజుగా సాగిన ఉత్కంఠకు తెరపడినట్లయింది. తొలుత డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ మాట్లాడుతూ, తాము రాజ్యాంగానికి కట్టుబడే ఉంటామని, దానికి వ్యతిరేకంగా ఏమీ చేయబోమని వ్యాఖ్యానించడం గమనార్హం.


More Telugu News