Chandrababu Naidu: పథకాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తా: చంద్రబాబు

Chandrababu Naidu to Review Schemes with Field Visits from November
  • ప్రజలు మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్నామన్న చంద్రబాబు
  • పాలనలో సుస్థిర విధానాలను అమలు చేస్తామని వెల్లడి
  • ఆర్టీజీఎస్, ప్రభుత్వ సేవల్లో సంతృప్త స్థాయిపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరును తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతీ పౌరుడికీ సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో పరిశీలిస్తానని సీఎం అన్నారు. బుధవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రభుత్వ సేవల్లో సంతృప్త స్థాయి సహా రియల్ టైమ్ గవర్నెన్స్‌ పనితీరుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలు మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్నామని, పాలనలో సుస్థిర విధానాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతనెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ధి తదితర అంశాలపై ప్రజల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్ వివరాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. దీపావళి పండుగ తర్వాత కూడా సూపర్ జీఎస్టీ ద్వారా పన్నుల తగ్గింపు, తద్వారా ధరలు తగ్గిన అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల కలిగే లబ్ధిని స్లైడ్స్ ద్వారా సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని ముఖ్యమంత్రి సూచించారు.

వన్ గవర్నమెంట్ - వన్ సిటిజన్ విధానంతో ప్రభుత్వ సేవలు

వివిధ శాఖలు అందించే ప్రభుత్వ సేవలపై టెక్నాలజీ డేటా ఆడిటింగ్ ద్వారా సంతృప్తస్థాయిని అంచనా వేస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు అధికారులు ఇచ్చే సమాచారానికి పొంతన ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. సామాన్యుడికి మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ అన్న విధానంతో సమర్ధవంతంగా ప్రజలకు సేవలందిస్తామని అన్నారు.

దీనిపై నవంబరు మొదటి వారంలో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల పనితీరును మదింపు చేస్తామని సీఎం అన్నారు. ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా వేర్వేరు ఘటనల్ని సమన్వయంతో పర్యవేక్షించటంతో పాటు త్వరితగతిన బాధితులకు స్వాంతన కలిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ చలానాల పేరిట వాహనదారులను ఇబ్బందులు పెట్టవద్దని ముఖ్యమంత్రి సూచించారు. 

సాంకేతికతతోనే రాజకీయ కుట్రలు బట్టబయలు

రాష్ట్రంలోని కొన్ని అంశాలను రాజకీయంగా ఉపయోగించుకుని నేరాలు చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ తరహా వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు నిర్మిస్తుంటే ప్రైవేటు పరం చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. పీపీపీ ద్వారా వచ్చే మెడికల్ కాలేజీల్లో పేద విద్యార్ధులకు అదనంగా మరిన్ని సీట్లు అందుబాటులోకి రావటంతో పాటు పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం కూడా లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు కూడా కొందరు కుట్రలు చేశారని సకాలంలో సాంకేతికత వినియోగించి వారి బండారం బయట పెట్టామన్నారు. ఇప్పుడు నకిలీ మద్యం తయారు చేసి తిరిగి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమీక్షకు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, ఐటీ, ఆర్టీజీఎస్, ఎక్సైజ్, భూగర్భ జల వనరుల శాఖ అధికారులు హాజరయ్యారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Government Schemes
Field Visits
Governance
Real Time Governance

More Telugu News