EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. సామాన్యుడు ఎలా బతకాలంటూ విపక్షాల ఆగ్రహం

EPFO New Rules Spark Opposition Anger Over How Common Man Will Survive
  • ఈపీఎఫ్ఓ నిబంధనలు క్రూరమైనవిగా అభివర్ణించిన ఎంపీ మాణికం ఠాగూర్
  • ఉద్యోగం కోల్పోయిన వారు బిల్లులు, ఈఎంఐలు ఎలా చెల్లించాలని టీఎంసీ ఎంపీ ప్రశ్న
  • సరళతరం పేరుతో కష్టపడి సంపాదించిన సొమ్ము దోచుకుంటన్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి విమర్శ
ఈపీఎఫ్ఓకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ముందస్తు ఉపసంహరణలకు సంబంధించిన గడువును 2 నెలల నుంచి 12 నెలలకు పెంచడం, ఈపీఎఫ్ఓ మొత్తం ఉపసంహరణకు వేచి ఉండే కాలాన్ని కూడా 2 నెలల నుంచి 36 నెలలకు సవరించడం, ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో 25 శాతం కనీస నిల్వలు ఉండాలన్న నిబంధన తీసుకురావడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ కొత్త నిబంధనలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఈపీఎఫ్ఓ తీసుకువచ్చిన నిబంధనలు క్రూరమైనవని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. పెన్షనర్లు, ఉద్యోగం కోల్పోయిన వారికి తమ పొదుపు సొమ్ము అందకుండా చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగం కోల్పోయిన వారు పీఎఫ్ నిధి కోసం ఇప్పుడు ఏడాది పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు. ఇది సంస్కరణ కాదని, దోపిడీ అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకుని సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న మన్‌సుఖ్ మాండవీయను కట్టడి చేయాలని సూచించారు.

ఒక ఉద్యోగి ఏదైనా కారణంతో ఉద్యోగం కోల్పోతే అతను బిల్లులు, ఈఎంఐలు ఎలా చెల్లిస్తారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ప్రశ్నించారు. ఏడాది తర్వాత నిధిని తీసుకున్న 75 శాతం మాత్రమే ఉపసంహరించుకోగలడని, మిగిలిన 25 శాతం కోసం పదవీ విరమణ వరకు వేచి చూడాలని వ్యాఖ్యానించారు. తమ నిధులను తీసుకోకుండా చేస్తే మధ్య తరగతి వ్యక్తి మనుగడ ఎలా సాగిస్తారని ఆయన నిలదీశారు.

నిబంధనలు సరళీకరణ పేరుతో కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకుంటున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ విమర్శించారు. 25 శాతం కనీస నిల్వల నిబంధన పేరుతో పదవీ విరమణ వరకు ఉపసంహరించుకునే అవకాశం కల్పించకపోవడం సరికాదని ఆమె అన్నారు.
EPFO
EPFO new rules
Employees Provident Fund Organisation
Manickam Tagore
Saket Gokhale

More Telugu News