విశాఖకు గూగుల్.. లక్షకు పైగా ఉద్యోగాలు: నారా లోకేశ్

  • విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడి
  • హైదరాబాద్‌ను మైక్రోసాఫ్ట్ మార్చినట్టే విశాఖను గూగుల్ మారుస్తుందన్న లోకేశ్
  • ఏపీలో బుల్లెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి పరుగులు పెడుతోందని వ్యాఖ్య
ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ స్వరూపమే మారిపోయినట్లు, ఇప్పుడు టెక్ దిగ్గజం గూగుల్ పెట్టుబడులతో విశాఖపట్నం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. గూగుల్ రాకతో విశాఖలో లక్షకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, రాష్ట్రాభివృద్ధిలో ఇదొక కీలక మైలురాయి కానుందని ఆయన తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేశ్ ఈ మేరకు వివరించారు.

విశాఖకు కేవలం గూగుల్ డేటా సెంటర్ మాత్రమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పనిచేసే అనేక అనుబంధ కంపెనీలు కూడా తరలివస్తున్నాయని మంత్రి వివరించారు. ఈ భారీ పెట్టుబడి వెనుక సుదీర్ఘ కృషి ఉందని, 2024 సెప్టెంబర్‌లో గూగుల్ ప్రతినిధులతో తొలి సమావేశం జరిగిందని గుర్తుచేశారు. ఆ తర్వాత తాను అమెరికా వెళ్లి గూగుల్ క్లౌడ్ యాజమాన్యంతో చర్చలు జరిపానని, నవంబర్‌లో ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారని తెలిపారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం పలుమార్లు చర్చించిన తర్వాతే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వ విధానం 'ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని - అభివృద్ధి వికేంద్రీకరణ' అని లోకేశ్ పునరుద్ఘాటించారు. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అనంతపురం, కర్నూలులో పంప్డ్ స్టోరేజ్, సిమెంట్ పరిశ్రమలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలు, శ్రీసిటీలో బ్లూస్టార్, డైకెన్ వంటి సంస్థల విస్తరణ, ప్రకాశంలో రిలయన్స్ పెట్టుబడులు, గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగం అభివృద్ధి వంటి ప్రణాళికలను వివరించారు.

తాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని, ఒక్క ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు తీసుకురావడాన్ని ఒక ఛాలెంజ్‌గా స్వీకరించామని లోకేశ్ అన్నారు. "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. మేము కేవలం ఎంవోయూలపై సంతకాలకే పరిమితం కాము, వాటిని ఆచరణలో చేసి చూపిస్తాం. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు కలిసి పనిచేస్తుండటంతో ఏపీలో డబుల్ ఇంజిన్ కాదు, 'డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్' వేగంతో అభివృద్ధి పరుగులు పెడుతోంది" అని ఆయన వ్యాఖ్యానించారు. 


More Telugu News