చిత్తడి నేలలను అనుసంధానిస్తూ భారీ పర్యాటక ప్రాజెక్టులు: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

  • ఉప ముఖ్యమంత్రి పవన్ అధ్యక్షతన స్టేట్ వెట్ ల్యాండ్ అథారిటీ సమావేశం
  • కీలక నిర్ణయాలు ప్రకటించిన పవన్ కల్యాణ్
  • రాష్ట్రంలో 16 చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ
  • కొల్లేరు లేక్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న పవన్ కల్యాణ్
రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, సంరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలో జరిగిన స్టేట్ వెట్ ల్యాండ్ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలను ప్రకటించారు.

రాష్ట్రంలో 16 చిత్తడి నేలల గుర్తింపు

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 16 చిత్తడి నేలలను అధికారికంగా గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. దేశ దక్షిణ భారత చరిత్రలో ఇదే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున చిత్తడి నేలలు గుర్తింపు పొందుతున్నాయని చెప్పారు.

సోంపేటలో ఎకో టూరిజం కారిడార్

సోంపేట, తవిటి మండలాల పరిధిలో ఉన్న పెద్ద బీల, చిన బీల, తుంపర చిత్తడి నేలలను అనుసంధానిస్తూ పర్యాటక కారిడార్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎకో టూరిజాన్ని ప్రోత్సహించి, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వివరించారు.

పక్షి సంరక్షణ కేంద్రాలు

అనంతపురం జిల్లాలోని వీరాపురం, రాజమండ్రి సమీపంలోని పుణ్యక్షేత్రం చిత్తడి నేలల్లో ప్రత్యేక పక్షి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అరుదైన పక్షి జాతుల సంరక్షణతోపాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటాయని తెలిపారు.

కొల్లేరు సరస్సు పరిరక్షణపై దృష్టి

రాష్ట్రంలోనే అతిపెద్ద రాంసర్ గుర్తింపు పొందిన కొల్లేరు చిత్తడి నేల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘కొల్లేరు లేక్ మేనేజ్‌మెంట్ అథారిటీ’ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అటవీ శాఖకు పవన్ కల్యాణ్ సూచించారు.

చిత్తడి నేలల భౌగోళిక గుర్తింపు వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా 23,450 చిత్తడి నేలల భౌగోళిక సరిహద్దుల గుర్తింపు జరుగుతోందని తెలిపారు. వీటిలో 99.3 శాతం నేలలకు డిజిటల్ గుర్తింపు పూర్తయిందని, ఈ నెల 28 లోపు భౌతిక సరిహద్దుల గుర్తింపు పూర్తి చేయాలని ఆదేశించారు.

పర్యావరణ పరిరక్షణే భావితరాల భవిష్యత్తు

“చిత్తడి నేలల సంరక్షణ భావితరాల భవిష్యత్తుకు అవసరం. ఇవి భూగర్భ జలాల నిల్వ, వర్షాకాల ప్రవాహ నియంత్రణ, జీవ వైవిధ్య పరిరక్షణకు కీలక పాత్ర పోషిస్తాయి. అదే సమయంలో ఎకో టూరిజం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది” అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఈ సమావేశంలో సీసీఎల్ఏ జయలక్ష్మి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, ఏపీసీసీఎఫ్ శాంతిప్రియ పాండే, ప్రత్యేక కార్యదర్శి ఎస్. శరవణన్, డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఫరిదా థంపాల్, శాస్త్రవేత్తలు రామ సుబ్రహ్మణ్యన్, డాక్టర్ గోల్డిన్ ఖుద్రోస్ తదితరులు పాల్గొన్నారు. 


More Telugu News