Chandrababu Naidu: లక్ష కోట్లతో విశాఖకు గూగుల్... సీఎం చంద్రబాబు టీమ్ కు ఘనస్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు

Chandrababu Naidu Welcomed as Google Invests in Visakhapatnam
  • విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు
  • దేశ ఐటీ చరిత్రలోనే ఇది ఒక పెద్ద మలుపుగా అభివర్ణన
  • ఢిల్లీలో హిస్టారికల్ డీల్
  • అమరావతికి తిరిగొచ్చిన సీఎంచంద్రబాబు బృందం
  • గూగుల్ రాకలో ఐటీ మంత్రి లోకేశ్ దే కీలక పాత్రన్న సీఎం
  • నాడు మైక్రోసాఫ్ట్, నేడు గూగుల్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖలో రూ.1.33 లక్షల కోట్లతో ఏఐ హబ్ ఏర్పాటు చేయనుండడం తెలిసిందే. ఈ మేరకు గూగుల్ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం నేడు ఢిల్లీలో హిస్టారికల్ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అనంతరం, ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మంగళవారం ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రానుండటంపై వారు హర్షం వ్యక్తం చేశారు. "థాంక్యూ సీఎం సార్, గూగుల్ కమ్స్ టు ఏపీ" అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలతో ముచ్చటించిన చంద్రబాబు, ఈ భారీ పెట్టుబడి తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ విజయం వెనుక ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పోషించిన కీలక పాత్రను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ సంస్థతో సంప్రదింపులు మొదలుపెట్టి, నిరంతరం ఫాలో అప్ చేయడం వల్లే ఈ లక్ష్యాన్ని సాధించగలిగామని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ఠ, 'ఏపీ బ్రాండ్' పునరుద్ధరణతోనే 16 నెలల వ్యవధిలోనే ఇలాంటి భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగామని చంద్రబాబు స్పష్టం చేశారు.

చరిత్రను మార్చే పెట్టుబడి

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదని, దేశ ఐటీ రంగంలోనే ఒక పెద్ద మైలురాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. "గతంలో హైదరాబాద్ దశ, దిశను మైక్రోసాఫ్ట్ రాక ఎలా మార్చిందో, నేడు ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ డేటా సెంటర్ అదే పాత్ర పోషిస్తుంది. విశాఖను ఐటీ హబ్‌గా మార్చే మా ప్రయత్నాలలో ఇదొక అతిపెద్ద ముందడుగు" అని చంద్రబాబు అన్నారు.

గతాన్ని గుర్తుచేసుకున్న సీఎం

ఈ సందర్భంగా తన గతానుభవాలను నేతలతో పంచుకున్నారు. "సుమారు 30 ఏళ్ల క్రితం నేను ఐటీ రంగాన్ని ప్రోత్సహించినప్పుడు సమాజంలో దానిపై ఇంత అవగాహన లేదు. భవిష్యత్తు అవకాశాలను ఊహించి ప్రణాళికలు అమలు చేస్తే ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించిన సందర్భాలు లేవు. కానీ నేను దావోస్ వంటి అంతర్జాతీయ సదస్సులకు వెళ్లి, విదేశాల్లో పర్యటించి పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేందుకు కృషి చేశాను. ఆ ప్రయత్నాల ఫలితంగానే హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలను తీసుకొచ్చి ఐటీకి బలమైన పునాది వేశాం" అని గుర్తు చేసుకున్నారు.

సామాన్యుడికి ప్రయోజనాలు వివరించాలి

గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చంద్రబాబు వివరించారు. ఈ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి, ముఖ్యంగా సామాన్యులకు అర్థమయ్యేలా వివరించాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. రాష్ట్రానికి వచ్చిన ఈ భారీ పెట్టుబడి ద్వారా కలిగే ప్రయోజనాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు.
Chandrababu Naidu
Google
Visakhapatnam
Andhra Pradesh
AP
AI Hub
Nara Lokesh
IT Sector
Data Center
Investment

More Telugu News