ED: రాష్ట్రం హక్కులను లాక్కుంటారా? : ఈడీపై సుప్రీంకోర్టు అసహనం

Supreme Court Slams ED Overstepping in Tamil Nadu Case
  • తమిళనాడు మద్యం కుంభకోణం కేసులో ఈడీని మందలించిన సుప్రీంకోర్టు
  • మద్యం రిటైలర్ అవకతవకలకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న రాష్ట్ర పోలీసులు
  • మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించిన ఈడీ
  • రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుండగా జోక్యం ఎందుకని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను లాక్కుంటారా అంటూ ఈడీపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తమిళనాడు మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీని భారత అత్యున్నత న్యాయస్థానం మందలించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను ఈడీ లాక్కుంటుందా? అలా చేయడం సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం కాదా అని ప్రశ్నించింది.

మద్యం రిటైలర్‌ టాస్మాక్‌లో అవకతవకలపై తమిళనాడు పోలీసులు, అవినీతి నిరోధక శాఖ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నాయి. అయితే ఆయా కేసుల ఆధారంగా ఈడీ కూడా మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. తనిఖీలలో ఆధారాలు లభించినట్లు ఈడీ ప్రకటించింది.

ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుండగా ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈడీని ప్రశ్నించింది. రాష్ట్ర పోలీసుల హక్కులను ఉల్లంఘించడమేంటి? మీకు అనుమానం వచ్చినప్పుడల్లా మీరే వెళ్లి దర్యాప్తు చేస్తారా? అని ప్రశ్నించింది. అలాంటప్పుడు సమాఖ్య వ్యవస్థకు అర్థం ఎక్కడ అని వ్యాఖ్యానించింది.

ఈ కేసులో తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈడీ టాస్మాక్ కార్యాలయంలో సోదాలు చేసి ఉద్యోగుల మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులను గంటల తరబడి నిర్బంధించారని కోర్టుకు తెలియజేశారు. ఈడీ ఏదైనా ఇతర నేరానికి సంబంధించిన ఆధారాలను గుర్తిస్తే ఆ సమాచారాన్ని సంబంధిత ఏజెన్సీతో పంచుకోవాలని చట్టం చెబుతోందని వాదనలు వినిపించారు.

ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ, తమిళనాడు పోలీసులు 47 కేసులు నమోదు చేశారని, ఇంకా అవినీతి కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమ నగదు, నకిలీ పత్రాలు, ఒప్పంద అక్రమాలకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు. ఆధారాలు దొరికినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సమర్పించలేదని సీజేఐ ప్రశ్నించారు.
ED
Tamil Nadu
Supreme Court
TASMAC
money laundering
corruption case
BR Gavai
Kapil Sibal

More Telugu News