ఉగ్రవాదం నుంచి, వ్యవస్థీకృత నేరాల నుంచి భారత్ ను కాపాడే బలమైన కవచం ఇది: అమిత్ షా

  • హర్యానాలోని మానేసర్‌లో ఎన్‌ఎస్‌జీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
  • అయోధ్యలో కొత్తగా ఎన్‌ఎస్‌జీ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు అమిత్ షా ప్రకటన
  • ప్రధాని మోదీ హయాంలో జీరో టెర్రరిజం పాలసీ అనుసరిస్తున్నాం
  • ఉగ్రవాదుల వెన్ను విరిచిన ఆపరేషన్ సిందూర్, మహాదేవ్
  • కమాండోల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రానికి శంకుస్థాపన
ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) దేశానికి ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. హర్యానాలోని మానేసర్‌లో మంగళవారం జరిగిన ఎన్‌ఎస్‌జీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన భద్రతా సిబ్బందికి ఆయన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఎన్‌ఎస్‌జీ కొత్త హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, జమ్మూలలో హబ్‌లు ఉండగా, అయోధ్యతో వాటి సంఖ్య ఏడుకు చేరుకుంటుందని వివరించారు. దీనివల్ల ఉగ్రవాద ముప్పును వేగంగా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని ఆయన అన్నారు.

అక్షరధామ్ ఆలయంపై దాడి, 26/11 ముంబై దాడులు, పలు బందీల విముక్తి ఆపరేషన్ల వంటి క్లిష్టమైన సమయాల్లో ఎన్‌ఎస్‌జీ చూపిన ధైర్యసాహసాలను ఆయన గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం 'జీరో టెర్రరిజం' విధానాన్ని అనుసరిస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు 2019 నుంచి యూఏపీఏ, ఎన్‌ఐఏ చట్టాలకు సవరణలు, టెర్రర్ ఫండింగ్‌ను అరికట్టేందుకు ఈడీ, పీఎంఎల్‌ఏకు అధికారాలు, పీఎఫ్‌ఐపై నిషేధం వంటి అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.

సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆర్టికల్ 370 రద్దు వంటి చర్యలతో ఉగ్రవాదుల వెన్ను విరిచామని ఆయన పేర్కొన్నారు. 'ఆపరేషన్ సిందూర్', 'ఆపరేషన్ మహాదేవ్' వంటి ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని, ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ పర్యటనలో భాగంగా, రూ. 141 కోట్ల వ్యయంతో 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ప్రత్యేక శిక్షణా కేంద్రానికి అమిత్ షా శంకుస్థాపన చేశారు. ఇది కమాండోలకు అత్యాధునిక శిక్షణ అందించనుందని తెలిపారు. అలాగే, 2019 నుంచి సీఏపీఎఫ్ సిబ్బంది 6.50 కోట్ల మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడ్డారని ఆయన కొనియాడారు.


More Telugu News