విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ప్ర‌ధాని మోదీ, లోకేశ్‌లకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

  • విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం
  • రానున్న ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్న గూగుల్
  • ప్రధాని మోదీ, మంత్రి లోకేశ్‌ కృషితోనే ఇది సాధ్యమైందన్న సీఎం చంద్రబాబు
  • ప్రతి కుటుంబానికి ఏఐని చేరువ చేయడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి
  • మోదీ, చంద్రబాబు లాంటి దార్శనిక నేతల వల్లే ప్రాజెక్టు సాకారమైంద‌న్న‌ నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల అభివృద్ధిలో మరో కీలక మైలురాయి పడనుంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి రావడం పట్ల సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషికి నిదర్శనమని వారు అభివర్ణించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషకరమని తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టును విశాఖకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కృషిని కూడా ఆయన అభినందించారు. తాను ఎప్పటినుంచో టెక్నాలజీతో అనుసంధానమై ఉన్నానని, హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం నుంచి ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నానని గుర్తుచేశారు. "ప్రతి కుటుంబానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని చేరువ చేయడంతో పాటు, 'వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్' విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే మా లక్ష్యం" అని చంద్ర‌బాబు స్పష్టం చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌తో పాటు సీ కేబుల్ ల్యాండింగ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తుండటం ఒక గొప్ప పరిణామమని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు వంటి దార్శనికత ఉన్న నేతల వల్లే ఇలాంటి ప్రాజెక్టులు సాధ్యమవుతాయని ఆమె ప్రశంసించారు. "కేంద్రంలో, ఏపీలో ప్రగతిశీల విధానాలు, నిర్ణయాల్లో వేగం ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. ఇప్పటికే ఏపీలో అనేక సేవలు డిజిటల్ రూపంలో ప్రజలకు అందుతున్నాయి, కాబట్టి ఈ డేటా సెంటర్‌కు ఏపీ సరైన ప్రదేశం" అని ఆమె అభిప్రాయపడ్డారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్రాల మధ్య ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ ఎంతో అవసరమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.


More Telugu News