Lalu Prasad Yadav: తండ్రి బీఫామ్ ఇచ్చాడు.. కొడుకు వెనక్కి తీసుకున్నాడు.. లాలూ ఇంట నాటకీయ పరిణామం

Tejashwi Yadav Reverses Lalus Decision on RJD Tickets
  • సోమవారం సాయంత్రం పలువురు అభ్యర్థులకు బీ ఫామ్ ఇచ్చిన లాలూ
  • అర్ధరాత్రి ఢిల్లీ నుంచి తేజస్వీ యాదవ్ తిరిగివచ్చాక మారిన సీన్
  • పార్టీ నేతలకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్న ఆర్జేడీ చీఫ్
అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ లో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ మహాఘట్ బంధన్ పార్టీల మధ్య సీట్ల పంపకంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం తండ్రీకొడుకులు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. ముందుగా లాలూ ప్రసాద్ యాదవ్ పాట్నాకు తిరిగి వచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ను ఆశిస్తున్న పలువురు ఆర్జేడీ నేతలు ఆయన నివాసం వద్ద వేచి ఉన్నారు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నేతలు పలువురిని నివాసంలోకి పిలిచి బీ ఫామ్ ను అందజేశారు. పార్టీ నేతలు పలువురికి పసుపు రంగులో ఉన్న కవర్లను లాలూ అందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిన సంతోషంతో సదరు అభ్యర్థులు ఇంటికి వెళ్లగా.. అర్ధరాత్రి సీన్ మారిపోయింది.

ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తేజస్వీ యాదవ్ తండ్రితో చర్చలు జరిపారు. అనంతరం బీ ఫామ్ ఇచ్చిన నేతలకు లాలూ ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. వారికి అందజేసిన బీఫామ్ లను తనయుడు వెనక్కి తీసుకున్నారు. దీనికి పార్టీ అధిష్ఠానం ఎలాంటి కారణాలు చెప్పలేదని సదరు నేతలు మీడియాకు వివరించారు. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారమని, లాలూ ఎవరికీ బీఫామ్ లు ఇవ్వలేదని మరికొందరు నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఆ ఫొటోలు ఏఐ సాంకేతికతతో తయారుచేశారని వాదిస్తున్నారు.
Lalu Prasad Yadav
Tejashwi Yadav
Bihar election
RJD party
Mahagathbandhan
Bihar politics
Seat allocation
Political drama
B form
RJD leaders

More Telugu News