ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఈ కిట్‌లతో అడ్డుకట్ట

ర్యాపిడ్ టెస్టింగ్ మొబైల్ కిట్లను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్ 
ఈ కిట్లతో స్పాట్‌లోనే రేషన్ బియ్యంను గుర్తించవచ్చన్న మంత్రి మనోహర్ 
రాష్ట్ర వ్యాప్తంగా 700 మొబైల్ కిట్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం నూతన చర్యలు చేపట్టింది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న రేషన్ బియ్యాన్ని తక్షణమే గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్టింగ్ మొబైల్ కిట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ర్యాపిడ్ కిట్లను విశాఖపట్నంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, పౌర సరఫరాల శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం నూతన చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. బియ్యాన్ని అక్కడికక్కడే పరీక్షించి, దాని మూలాన్ని గుర్తించేలా మొబైల్ కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 700 మొబైల్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. పరీక్షలో బియ్యం ఎరుపు రంగులోకి మారితే, అవి రేషన్ బియ్యంగా నిర్ధారించవచ్చని మంత్రి వివరించారు. ఈ విధానం ద్వారా పి.డి.ఎస్. బియ్యం దుర్వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. 



More Telugu News