Nara Lokesh: విశాఖ సీఐఐ సదస్సు: జాతీయ, అంతర్జాతీయ నేతలకు లోకేశ్ ఆహ్వానం

Nara Lokesh Invites Global Leaders to Visakhapatnam CII Summit
  • నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
  • విజయవంతం చేసేందుకు ఇప్పటికే రంగంలోకి దిగిన మంత్రి లోకేశ్
  • జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు, నేతలకు ఆహ్వానాలు
  • ముఖ్య అతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించాలని నిర్ణయం
  • పెట్టుబడుల ఆకర్షణ, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంపే లక్ష్యమన్న సీఎం
  • సదస్సుకు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచానికి చాటే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన సీఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసేందుకు మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. పలు దేశాల్లో పర్యటించి జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలకు, కీలక నేతలకు ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపుతూ సదస్సు విజయానికి మార్గం సుగమం చేస్తున్నారు.

ఈ సదస్సు సన్నాహకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అమరావతి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావాలని, సరికొత్త ఆలోచనలకు ఇది వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీంతో పాటు వివిధ దేశాల వాణిజ్య మంత్రులను, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈవోలను కూడా సదస్సుకు పిలవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

'టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్' అనే థీమ్‌తో జరగనున్న ఈ సదస్సులో మొత్తం 13 సెషన్లు నిర్వహించనున్నారు. ఇందులో రక్షణ, ఏరోస్పేస్, హెల్త్ కేర్, క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతాయి. జీ20 దేశాలతో పాటు యూరప్, ఆసియా, మధ్యప్రాచ్యం నుంచి దాదాపు 40 దేశాల ప్రతినిధులు, 29 మంది వాణిజ్య మంత్రులు, 80 మందికి పైగా దేశ, విదేశీ సీఈవోలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని ఈ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించాలని చంద్రబాబు సూచించారు. గతంలో 2016, 2017, 2018 సంవత్సరాల్లో కూడా విశాఖలోనే సీఐఐ సదస్సులు జరిగాయి. ఇప్పుడు నాలుగోసారి కూడా విశాఖే ఈ అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చందర్జిత్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
CII Partnership Summit
Visakhapatnam
Andhra Pradesh Investments
Chandrababu Naidu
AP Brand Image
Vizag Summit
Technology Trust Trade
Indian Industry Conference
AP Economic Development

More Telugu News