Chandrababu Naidu: విశాఖలో గూగుల్ ఏఐ హబ్... రేపు ఢిల్లీలో చారిత్రాత్మక ఒప్పందం

Chandrababu Naidu Google AI Hub in Visakhapatnam Historic Deal in Delhi
  • విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధం
  • సుమారు రూ.87,250 కోట్లతో భారీ పెట్టుబడి పెట్టనున్న టెక్ దిగ్గజం
  • ఢిల్లీలో రేపు ఏపీ ప్రభుత్వం, గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం
  • విశాఖను ఏఐ సిటీగా మార్చడమే ప్రధాన లక్ష్యం
  • లక్షల సంఖ్యలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పన
  • సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల భవిష్యత్తును మార్చే దిశగా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలో సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.87,250 కోట్లు) భారీ పెట్టుబడితో ‘గూగుల్ ఏఐ హబ్’ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవబోతున్న ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి మంగళవారం న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ ప్రతినిధుల మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) జరగనుంది. ఈ ఒప్పందంతో విశాఖపట్నం దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (AI) నగరంగా రూపాంతరం చెందనుంది.

ఢిల్లీలోని మాన్‌సింగ్ హోటల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ ఆధారిత ఆవిష్కరణలలో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

గత ఏడాది అక్టోబర్ 31న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో జరిపిన చర్చలలో ఏపీలో ప్రపంచస్థాయి ఏఐ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత పలు దఫాలుగా జరిగిన చర్చలు ఫలించి, ఈ భారీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. ఈ ఒప్పందంలో భాగంగా విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ను గూగుల్ నిర్మించనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది. అత్యాధునిక ఏఐ మౌలిక సదుపాయాలు, భారీ ఇంధన వనరులు, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌లను ఒకేచోట ఏర్పాటు చేసి విశాఖను దేశ ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. 2028-2032 మధ్య కాలంలో ఏటా సగటున రూ.10,518 కోట్లను రాష్ట్ర జీఎస్‌డీపీకి చేర్చనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,88,220 ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. అంతేకాకుండా, గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఏటా రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. మొత్తం ఐదేళ్లలో దాదాపు రూ.47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకుంటుందని భావిస్తున్నారు. 

ఈ ప్రాజెక్టుకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదం లభించింది. ప్రాజెక్టును వేగంగా పట్టాలెక్కించేందుకు సింగిల్ విండో క్లియరెన్స్, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్, కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తనలో దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు మార్గం సుగమం అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Chandrababu Naidu
Google AI Hub
Visakhapatnam
Andhra Pradesh
Nara Lokesh
Artificial Intelligence
AI City
India
Investment
Data Center

More Telugu News