సీఆర్డీఏ భవనం ప్రారంభం... ప్రతి ఫ్లోరును పరిశీలించిన సీఎం చంద్రబాబు

  • రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
  • పనుల పూర్తికి నిర్దిష్ట గడువు పెట్టుకోవాలని అధికారులకు ఆదేశం
  • వర్షాలు తగ్గాక పనులు పరుగులు పెట్టించాలని స్పష్టమైన సూచన
  • నిధుల కొరత లేదని, ఆర్థిక శాఖతో మాట్లాడతానని హామీ
  • సీఆర్డీఏ నూతన భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
  • సమీక్షలో మంత్రులు పెమ్మసాని, నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రతి పనికి నిర్దిష్ట గడువు నిర్దేశించుకుని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిధుల గురించి ఆందోళన అవసరం లేదని, ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన రాజధాని నిర్మాణ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

అంతకుముందు, సీఆర్డీఏ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, ప్రతి అంతస్తునూ స్వయంగా పరిశీలించారు. ఏయే విభాగాలను ఎక్కడ ఏర్పాటు చేశారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు. నిర్మాణాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, "ప్రస్తుతం వర్షాల వల్ల పనులకు కొంత ఆటంకం కలిగినా, వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు పరుగులు పెట్టాలి. అవసరమైతే అదనపు వర్క్ ఫోర్స్, మిషనరీని రంగంలోకి దించండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవీ లేవు. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఆర్థిక శాఖకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇస్తాను" అని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాస్ తో పాటు పురపాలక శాఖ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


More Telugu News