మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'త్రిబాణధారి బార్బరిక్'. విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, సత్యరాజ్ .. ఉదయభాను .. వశిష్ఠ సింహా ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 29వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఆ సమయంలో దర్శకుడు రిలీజ్ చేసిన ఒక వీడియో కారణంగానే ఈ సినిమా టైటిల్ జనంలోకి వెళ్లింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: శ్యామ్ (సత్యరాజ్) ఓ మానసిక వైద్య నిపుణుడు. కొడుకు - కోడలు ఒక ప్రమాదంలో చనిపోవడంతో, మనవరాలు 'నిధి'తో కలిసి హైదరాబాదులో నివసిస్తూ ఉంటాడు. 14 ఏళ్ల 'నిధి' ఒక స్కూల్లో చదువుతూ ఉంటుంది. నిధికి ఒకసారి ఆయన 'బార్బరిక్' నాటకాన్ని చూపిస్తాడు. మూడు బాణాలతో బార్బరికుడు అనుసరించే విధానం ఆయనకి నచ్చుతుంది. ఆ నాటకం నిధిపై కూడా ప్రభావాన్ని చూపుతుంది.

హైదరాబాదులో వాకిలి పద్మ (ఉదయభాను) డాన్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. దేవ్ ఆమెకి  మేనల్లుడు. అతనికి తన కూతురు మహాలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయాలని పద్మ భావిస్తుంది. దేవ్ స్నేహితుడే రామ్ (వశిష్ఠ ఎన్ సింహా). అతను సత్య అనే యువతిని లవ్  చేస్తూ ఉంటాడు. లైఫ్ లో సెటిల్ కావడం కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం, ఆలోచన చేస్తూ ఉంటాడు. 

తుపాను కారణంగా హైదరాబాదులో వర్షం కురుస్తూ ఉంటుంది. చీకటి పడుతున్నా నిధి ఇంటికి రాకపోవడంతో, ఆమె తాత శ్యామ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు. అతనితో కలిసి నిధిని వెతకడం కోసం కానిస్టేబుల్ చంద్ర (సత్యం రాజేశ్) బరిలోకి దిగుతాడు. చివరిసారిగా నిధి ఓ కుర్రాడితో కనిపించిందని తెలుసుకుంటారు. ఆ కుర్రాడు ఎవరు? నిధి ఏమైపోతుంది? ఆమె క్షేమంగా తిరిగొస్తుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: "మనం బ్రతుకుతున్నది ఒక అరణ్యంలో. మృగాలు మన గుమ్మం ముందే పొంచి ఉంటాయి. మనం బలహీనంగా ఉంటే అవి లోపలికి వచ్చేస్తాయి" అనేది ఈ సినిమాలో కథానాయకుడు చెప్పే డైలాగ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అంశం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. అందరం కలిసి బ్రతుకుతున్నట్టుగా కనిపించినా, ఇక్కడ ఎవరి సమస్యకు వారే పరిష్కారాన్ని వెతుక్కోవాలి అనే అంశాన్ని గురించి చెబుతుంది. 

ఈ కథలో మెయిన్ లైన్ తాత - మనవరాలు చుట్టూ తిరుగుతుంది. దేవ్ - శ్రీరామ్ - దాసన్న ట్రాక్, వాకిలి పద్మ ట్రాక్ మెయిన్ లైన్ తో సమానంగా నడుస్తూ ఉంటాయి. అయితే ఈ రెండు ట్రాకులు ఆశించిన స్థాయిలో పవర్ఫుల్ గా అనిపించవు. అనుకున్నంత పవర్ఫుల్ గా ఉదయభాను పాత్రను డిజైన్ చేయలేదు. ఇక వాకిలి పద్మ చేసేదే దందా, అలాంటి ఆమె మేనల్లుడు దాసన్న అనే ఆకురౌడీ దగ్గర అప్పు చేసి అతనికి భయపడటం చిత్రంగా అనిపిస్తుంది.

సత్యరాజ్ ను ప్రధానమైన పాత్రగా తీసుకుని ఆ పాత్రను పవర్ఫుల్ గా డిజైన్ చేస్తున్నప్పుడు, ఆయన చుట్టూ ఉన్న ముఖ్యమైన పాత్రలకు కూడా క్రేజ్ ఉన్న ఆర్టిస్టులను తీసుకుని ఉండవలసింది. అలాగే బార్బరికుడి ఎపిసోడ్ ని మరికాస్త ఎఫెక్టివ్ గా చూపించి ఉండవలసింది. అలా చేయకపోవడం వలన కంటెంట్ పై  అంత ఇంపాక్ట్ చూపలేదని అనిపిస్తుంది. తనకిచ్చిన బడ్జెట్ కి తగిన అవుట్ పుట్ ఇవ్వడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడనే చెప్పాలి. 

పనితీరు: కొంతమంది కామాంధుల వలన కూతురికో .. మనరాలికో అన్యాయం జరిగినప్పుడు, తానే ఒక ఆయుధంగా మారిపోయి దుర్మార్గులను శిక్షించే ప్రధానమైన పాత్రలతో కూడిన కొన్ని కథలు గతంలో వచ్చాయి. అయితే అలాంటి ఒక కథను 'బార్బరికుడు'తో ముడిపెట్టి తయారు చేయడం కొత్తగా అనిపిస్తుంది.

సత్యరాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. మిగతా ఆర్టిస్టులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.  కుశేన్దర్ రమేష్ ఫొటోగ్రఫీ .. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ తో పాటు నేపథ్య సంగీతం కూడా ఫరవాలేదనిపిస్తుంది. 

ముగింపు: కథలో కొత్తదనం లేకపోయినా, ఆ కథకి ఇతిహాసాన్ని జోడించిన తీరు బాగుంది. అయితే ఆ కథను బలంగా చెప్పడానికి అవసరమైన ఇతర ట్రాకులు బలహీనంగా మారడమే లోపంగా  అనిపిస్తుంది. క్రేజ్ ఉన్న ఆర్టిస్టులు తోడై ఉంటే, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి ఉండేదేమో.