చెట్టును నరికేశారని భోరున విలపిస్తున్న వృద్ధురాలు.. వీడియో ఇదిగో!

  • 20 సంవత్సరాల క్రితం మొక్క నాటి సొంత బిడ్డలా పెంచుకున్న వృద్ధురాలు
  • ఆ చెట్టుతో తమకూ అనుబంధం ఉందంటున్న గ్రామస్థులు
  • ఛత్తీస్ గఢ్ లో ఘటన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
సొంత బిడ్డలా పెంచుకున్న చెట్టును నరికివేయడంతో ఓ వృద్ధురాలు భోరున విలపిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎనభై ఐదేళ్ల వయసున్న ఆ వృద్ధురాలి కన్నీళ్లను చూసి గ్రామస్థులు కూడా కంటతడి పెట్టారు. చివరకు అదే స్థలంలో మరో రావి మొక్కను నాటి, దానిని ప్రేమగా పెంచుదామని ఊరంతా తీర్మానించడంతో వృద్ధురాలు తేరుకుంది. ఏడుపు ఆపి ఆ మొక్కకు పూజ చేసింది. ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నందగావ్ జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇరవై ఏళ్ల క్రితం ఓ రావి మొక్కను నాటింది. నిత్యం దానికి నీళ్లు పోస్తూ సొంత కొడుకులా పెంచింది. ఏళ్లు గడుస్తున్నకొద్దీ మహావృక్షంగా మారిన ఆ చెట్టుతో వృద్ధురాలికి ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. ఆ చెట్టుపై వృద్ధురాలికి ఉన్న ప్రేమను గ్రామస్థులు కూడా గమనించారు. అయితే, తాజాగా ఆ చెట్టును పంచాయతీ సిబ్బంది నరికివేశారు. దీంతో ఆ వృద్ధురాలు అక్కడికి వచ్చి భోరుమని ఏడ్వడం మొదలుపెట్టింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

సొంత కొడుకును కోల్పోయిన తల్లిలా బాధపడుతున్న వృద్ధురాలిని చూసి గ్రామస్థులు కూడా కంటతడి పెట్టుకున్నారు. చెట్టు మొదలును పట్టుకుని వృద్ధురాలు ఏడుస్తుండడం చూసి గ్రామస్థుడు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ ఎంపీ కిరణ్ రిజిజు కూడా ఈ వీడియోకు స్పందిస్తూ.. హృదయాన్ని కదిలించే సంఘటన అంటూ కామెంట్ పెట్టారు.


More Telugu News