Amir Khan Muttaqi: మహిళా జర్నలిస్టుల వివాదం.. దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఆఫ్ఘన్ మంత్రి

Amir Khan Muttaqi Addresses Women Journalist Controversy in Afghanistan
  • మహిళా జర్నలిస్టుల వివాదంపై వివరణ ఇచ్చిన ఆఫ్గన్ మంత్రి
  • సాంకేతిక కారణాలతోనే కొందరిని పిలిచామని వెల్లడి
  • ఢిల్లీలో అందరితో మరోసారి విలేకరుల సమావేశం
  • ఆగిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించేందుకు భారత్‌తో అంగీకారం
  • భారత్-ఆఫ్ఘన్ సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం
  • అమృత్‌సర్ నుంచి ఆఫ్గన్‌కు త్వరలో విమానాలు
విలేకరుల సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై వచ్చిన విమర్శలతో ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అది సాంకేతిక కారణాలతో జరిగిన పొరపాటే తప్ప, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. ఈ వివాదానికి తెరదించేందుకు ఆదివారం ఢిల్లీలో మరోసారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, స్త్రీ, పురుష జర్నలిస్టులందరినీ ఆహ్వానించారు.

శుక్రవారం ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మహిళా జర్నలిస్టులకు ఆహ్వానం అందకపోవడంపై ప్రతిపక్షాలు, మీడియా వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ముత్తాఖీ స్పందిస్తూ "తక్కువ సమయం ఉండటంతో మా రాయబార కార్యాలయం కొందరు నిర్దిష్ట జర్నలిస్టులతోనే సమావేశం ఏర్పాటు చేయాలని భావించింది. ఇది కేవలం సాంకేతికంగా జరిగింది. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఎవరి హక్కులనూ మేం నిరాకరించం" అని వివరించారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో జరిపిన ద్వైపాక్షిక చర్చల వివరాలను కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఆప్గనిస్థాన్‌లో ఆగిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపారు. త్వరలోనే ఆఫ్ఘన్ నుంచి ఒక దౌత్య బృందం ఢిల్లీకి రానుందని, అలాగే అమృత్‌సర్ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు విమాన సర్వీసులు కూడా పునఃప్రారంభం కానున్నాయని చెప్పారు.

ఇదిలా ఉండగా, భారత్-ఆఫ్ఘనిస్థాన్ సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్‌ను భారత భూభాగంగా పేర్కొనడం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. ఉగ్రవాదంలో పాక్ పాత్ర ఉందని ముత్తాఖీ పేర్కొనడాన్ని కూడా తోసిపుచ్చింది. ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని ఆఫ్ఘన్ రాయబారికి తమ నిరసనను తెలియజేసింది.
Amir Khan Muttaqi
Afghanistan
Delhi
Women Journalists
Press Conference
S Jaishankar
India Afghanistan Relations
Pakistan
Terrorism

More Telugu News