Alyssa Healy: మహిళల వరల్డ్ కప్: అంత స్కోరు చేసినా ఓడిపోయిన భారత్

Alyssa Healy Century Leads Australia to Victory Over India
  • మహిళల ప్రపంచకప్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం
  • విధ్వంసక సెంచరీతో ఆసీస్‌ను గెలిపించిన కెప్టెన్ అలిస్సా హీలీ
  • మొదట బ్యాటింగ్ చేసి 330 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా
  • టీమిండియాకు వరుసగా రెండో ఓటమి 
మహిళల ప్రపంచకప్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత జట్టుపై 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించి 331 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, ఆసీస్ కెప్టెన్ అలిస్సా హీలీ (142) ఆకాశమే హద్దుగా చెలరేగి నమోదు చేసిన విధ్వంసక సెంచరీ ముందు టీమిండియా పోరాటం సరిపోలేదు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణయానికి సవాలు విసురుతూ భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఓపెనర్లు స్మృతి మంధన (66 బంతుల్లో 80), ప్రతిక రావల్ (96 బంతుల్లో 75) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో బలమైన పునాది వేశారు. అనంతరం వచ్చిన హర్లీన్ డియోల్ (38), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22), జెమీమా రోడ్రిగ్స్ (33), రిచా ఘోష్ (32) కూడా వేగంగా ఆడటంతో భారత జట్టు 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 5 వికెట్లతో భారత పతనంలో కీలక పాత్ర పోషించింది.

భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు కెప్టెన్ అలిస్సా హీలీ అండగా నిలిచింది. కేవలం 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 142 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. మరో ఓపెనర్ ఫోబీ లిచ్‌ఫీల్డ్ (40)తో కలిసి శుభారంభం అందించింది. మధ్యలో భారత బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్లు తీసినప్పటికీ, ఆష్లే గార్డనర్ (45), ఎల్లీస్ పెర్రీ (47 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో శ్రీ చరణి 3 వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ చెరో రెండు వికెట్లు తీశారు. అద్భుత శతకంతో జట్టును గెలిపించిన హీలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

కాగా, టీమిండియాకు ఇది వరుసగా రెండో ఓటమి. ఇటీవలే విశాఖ మైదానంలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్ లోనూ స్కోరును కాపాడుకోలేక ప్రత్యర్థికి విజయాన్ని అప్పగించింది. 
Alyssa Healy
Alyssa Healy century
India vs Australia
Women's World Cup
Smriti Mandhana
Harmanpreet Kaur
Visakhapatnam
Cricket
Indian Women's Cricket Team
Australia Women's Cricket Team

More Telugu News