నకిలీ మద్యం గుర్తించే యాప్ ప్లే స్టోర్ లో ఉంది... డౌన్ లోడ్ చేసుకోండి: సీఎం చంద్రబాబు

  • నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు 'ఏపీ ఎక్సైజ్ సురక్ష' యాప్ ఆవిష్కరణ
  • ఉండవల్లి నివాసంలో యాప్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • లిక్కర్ బాటిల్ లేబుల్‌ను స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వెల్లడి
  • స్కాన్ చేసినప్పుడు 'ఇన్ వాలిడ్' అని వస్తే అది నకిలీ మద్యం
  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
  • గత ప్రభుత్వ హయాంలోనే కల్తీ మద్యం పెరిగిపోయిందని సీఎం విమర్శ
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ, కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. వినియోగదారులు కొనుగోలు చేస్తున్న మద్యం అసలుదో, నకిలీదో సులభంగా గుర్తించేందుకు వీలుగా 'ఏపీ ఎక్సైజ్ సురక్ష' పేరుతో ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఇటీవల ములకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం ఘటన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.

ఈ యాప్ ద్వారా మద్యం ప్రియులు తాము కొంటున్న బాటిల్ నాణ్యతను క్షణాల్లో తెలుసుకోవచ్చని చంద్రబాబు వివరించారు. మద్యం బాటిల్‌పై ఉన్న లేబుల్‌ను ఈ యాప్‌తో స్కాన్ చేయగానే, ఆ ఉత్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెరపై కనిపిస్తాయని తెలిపారు. బాటిల్ సీల్, ఎమ్మార్పీ, బ్యాచ్ నంబర్, ఏ డిస్టిలరీలో తయారైంది, తయారీ తేదీ వంటి సమాచారం స్పష్టంగా కనిపిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒకవేళ స్కాన్ చేసినప్పుడు 'ఇన్ వాలిడ్' (చెల్లనిది) అని వస్తే, ఆ మద్యం బాటిల్ నకిలీదని సులభంగా గుర్తించవచ్చని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉందని, ప్రతి ఒక్కరూ దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. భవిష్యత్తులో ఈ యాప్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇకపై రాష్ట్రంలో నకిలీ మద్యానికి ఆస్కారం లేకుండా, ప్రజలను మోసం చేసేందుకు వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేశారు. కల్తీ మద్యం అనేది గత వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన సమస్య అని ఆయన ఆరోపించారు. తమ హయాంలో ఇలాంటి మోసాలకు తావులేకుండా పారదర్శకమైన విధానాలను అమలు చేస్తామని ఆయన అన్నారు.


More Telugu News