Nara Lokesh: విశాఖకు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ రాక.. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన

Nara Lokesh Inaugurates AI Edge Data Center in Visakhapatnam
  • మంగళవాయిద్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు
  • ఏపీకి సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్
  • కూటమి ప్రభుత్వంపై భరోసాతో తరలివస్తున్న కంపెనీలు
విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక సంస్థ తరలివచ్చింది. దేశ కృత్రిమ మేధ సాధికారత దిశగా విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గం రుషికొండ, మధురవాడ ఐటీ పార్క్ లోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు.

మంగళవాయిద్యాలతో మంత్రికి స్వాగతం..
మధురవాడలోని ఐటీ పార్క్ కు చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు మంగళవాయిద్యాలతో నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు, రుషికొండలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాలను ఆవిష్కరించారు.

గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ..
ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాకతో భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకుంటుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ.1,500 కోట్ల పెట్టుబడితో సిఫీ సంస్థ రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ను అభివృద్ధి చేయనుంది. తద్వారా వెయ్యిమందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీ మెరుగుపడనుంది. 
 
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా సీనియర్ నేతల హాజరు..
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పెన్మత్మ విష్ణుకుమార్ రాజు, పి.గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, గంటా రవితేజ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులో పాటు సిఫీ చైర్మన్ రాజు వేగేశ్న, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షా రామ్, రాజేష్ తిరుమల రాజు, సిఫీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చెన్నకేశవ్ తో పాటు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఐటీసీ అండ్ ఈ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, విశాఖ కలెక్టర్ హరీంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు ఎన్.యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Visakhapatnam
AI Edge Data Center
Sify Technologies
Open Cable Landing Station
Andhra Pradesh
IT Park
Digital Gateway
Investment
Jobs

More Telugu News