భారతి సిమెంట్స్ సహా ఏసీసీ, రాంకోలకు షాక్ ఇచ్చేందుకు సిద్దమైన ఏపీ సర్కార్

  • సిమెంట్ కంపెనీలకు సున్నపురాయి లీజుల మంజూరులో అక్రమాలు
  • నిబంధనలకు విరుద్దంగా మూడు కంపెనీలకు సున్నపురాయి లీజులు
  • లీజుల రద్దు చేసేందుకు చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్  
ఆంధ్రప్రదేశ్‌లో సున్నపురాయి గనుల లీజుల మంజూరులో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ముఖ్యంగా భారతి సిమెంట్స్‌కు 2024 ఎన్నికలకు ముందు మంజూరు చేసిన రెండు లీజులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర గనుల శాఖ అభ్యంతరాలు, అడ్వకేట్ జనరల్ నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కేంద్ర నిబంధనల ఉల్లంఘన

కేంద్ర గనుల శాఖ 2015లో ప్రధాన ఖనిజాలైన సున్నపురాయి (Limestone) గనుల లీజులను తప్పనిసరిగా వేలం ద్వారా మాత్రమే కేటాయించాలని నిబంధన విధించింది. అంతేకాకుండా, 2015 జనవరి 12కు ముందు జారీ అయిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI)లు 2017 జనవరి 11 నాటికి అవసరమైన అన్ని అనుమతులు పొందకపోతే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేసింది.

అయితే, ఈ నిబంధనలను విస్మరించి, అప్పటి ప్రభుత్వం భారతి సిమెంట్స్‌కు 2024 ఎన్నికల ముందు రెండు లీజులను మంజూరు చేసింది.

భారతి సిమెంట్స్ లీజుల మంజూరు ఎలా జరిగింది?

భారతి సిమెంట్స్‌కు చెందిన లీజు భూములు కడప జిల్లాలోని కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో ఉన్నాయి. వాటి విస్తీర్ణం 509.18 ఎకరాలు, 235.56 ఎకరాలు. ఈ భూములు మొదట రఘురాం సిమెంట్స్‌కు చెందినవి. 2009లో భారతి సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసి LOI పొందింది. అయితే, నిర్ణీత గడువులోగా అనుమతులు పొందకపోవడంతో ప్రభుత్వం LOIని రద్దు చేసింది. 2016లో రఘురాం సిమెంట్స్ పేరు మార్పు విషయాన్ని దాచిపెట్టినందుకు ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. దీనిపై సంస్థ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టేటస్‌కో ఇచ్చింది. అనంతరం, 2024 ఎన్నికలకు ముందు (ఫిబ్రవరి 2న) ప్రభుత్వం రెండు లీజులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏసీసీ, రామ్‌కో సిమెంట్స్ లీజులు కూడా పరిశీలనలో

భారతి సిమెంట్స్‌తో పాటు ఏసీసీ, రామ్‌కో సిమెంట్స్‌కు కూడా ఇలాంటి లీజులు ఇచ్చినట్లు గుర్తించారు. అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ (ఏసీసీ)కి కడప జిల్లా మైలవరం మండలంలో 2,463 ఎకరాలకు 2010లో LOI జారీ చేయగా, 2023 నవంబర్ 15న లీజు మంజూరైంది. రామ్‌కో సిమెంట్స్‌కు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం వద్ద 267.30 ఎకరాలకు 2024 మార్చి 15న లీజు మంజూరు చేశారు.

ఐఎంబీ పరిశీలన - కేంద్రానికి నివేదిక

ఈ మూడు సంస్థలు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం)కు మైనింగ్ ప్లాన్ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. పరిశీలనలో ఐబీఎం ఈ లీజుల్లో కేంద్ర నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించింది. వేలం లేకుండా నేరుగా లీజులు ఇవ్వడం చట్టవిరుద్ధమని నివేదికలో పేర్కొంది. దీనిపై కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని పునఃపరిశీలన చేయాలని కోరింది.

రద్దు ఆదేశాల దిశగా

కూటమి ప్రభుత్వం న్యాయశాఖ, అడ్వకేట్ జనరల్ (ఏజీ) అభిప్రాయాలను కోరగా, ఏజీ నివేదికలో ఈ లీజులు చట్టవిరుద్ధమని, వాటిని రద్దు చేయడమే సరైన చర్య అని సూచించారు.

ప్రస్తుతం రాష్ట్ర గనుల శాఖ తుది నివేదికను సిద్ధం చేస్తోంది. నివేదిక సమర్పించిన వెంటనే, భారతి సిమెంట్స్, ఏసీసీ, రామ్‌కో సిమెంట్స్‌కు ఇచ్చిన నాలుగు లీజులను రద్దు చేసే అవకాశం ఉంది.

వేలం ద్వారా కొత్త లీజులు

లీజులు రద్దయిన తర్వాత, కేంద్ర గనుల చట్టం ప్రకారం పబ్లిక్ వేలం ద్వారా కొత్త లీజులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 


More Telugu News