Prashant Kishor: రాహుల్‌కు పట్టిన గతే తేజస్వికి కూడా పడుతుంది: ప్రశాంత్ కిశోర్

Prashant Kishor Tejashwi Yadav Will Lose Raghopur Like Rahul Lost Amethi
  • తేజస్వి ఓటమి ఖాయమన్న ప్రశాంత్ కిశోర్
  • రఘోపూర్ నియోజకవర్గం దశాబ్దాలుగా లాలూ కుటుంబం ఆధిపత్యంలో ఉందని విమర్శ
  • వంశపారంపర్య పాలనకు ముగింపు పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారని వ్యాఖ్య
2019లో కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్ గాంధీకి ఎదురైన పరాభవం లాంటిదే, రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు కూడా తప్పదని జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) సంచలన వ్యాఖ్యలు చేశారు. తేజస్వీ ప్రాతినిధ్యం వహిస్తున్న రఘోపూర్ నియోజకవర్గంలోనే ఈ ఎన్నికల్లో ఆయన అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

పాట్నాలోని రఘోపూర్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "కాంగ్రెస్‌కు 15 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీ, బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో అవమానకర రీతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆర్జేడీకి, తేజస్వీ యాదవ్‌కు కూడా అదే గతి పడుతుంది" అని స్పష్టం చేశారు.

రఘోపూర్ నియోజకవర్గం దశాబ్దాలుగా లాలూ కుటుంబం ఆధిపత్యంలో ఉందని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. 1995, 2000లలో లాలూ ప్రసాద్ యాదవ్, 2005లో రబ్రీ దేవి, ఆ తర్వాత 2015, 2020లలో తేజస్వీ యాదవ్ ఇక్కడి నుంచే గెలిచారని గుర్తు చేశారు. ఇన్నేళ్లుగా ఒకే కుటుంబం పాలిస్తున్నా, ఈ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా వంశపారంపర్య పాలనకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. 
Prashant Kishor
Tejashwi Yadav
Bihar Elections
Raghopur
Rahul Gandhi
Smriti Irani
RJD
Jan Suraaj Party
Political Analysis
Bihar Politics

More Telugu News