Nara Lokesh: రేపు విశాఖలో మంత్రి నారా లోకేశ్ పర్యటన.. ఏపీలో మొట్టమొదటి ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన

Nara Lokesh to Inaugurate APs First AI Data Center in Visakhapatnam
  • డేటా సెంటర్ల హబ్ గా విశాఖ
  • సిఫీ సంస్థ రూ.1500 కోట్ల భారీ పెట్టుబడి
  • వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు
  • ఏఐ ఆధారిత డేటా సెంటర్‌తో పాటు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్
  • గ్లోబల్ డిజిటల్ గేట్‌వేగా మారనున్న విశాఖ
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. విశాఖపట్నాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చే ప్రయత్నంలో భాగంగా కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదివారం నాడు విశాఖ నగరంలో పర్యటించి, రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం విశాఖ భవిష్యత్ ప్రగతికి నాంది పలకనుందని భావిస్తున్నారు.

కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి. విశాఖ డేటా సెంటర్ల హబ్ గా రూపుదిద్దుకోనుంది. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి నారా లోకేశ్... ఈ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 12వ తేదీన విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకోవడంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది. 

రాష్ట్రంలో సాంకేతిక రంగం అభివృద్ధిలో భాగంగా నారా లోకేశ్... నాస్ డాక్ లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్(Sify Infinit Spaces Limited) నిర్మించబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ను సిఫీ అభివృద్ధి చేయనుంది. తద్వారా వెయ్యిమందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూ.. ఎడ్జ్ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం కల్పిస్తుంది. భారతదేశంతో పాటు ఆగ్నేయాసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్ లాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ సీఎల్ఎస్ వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్ గా పనిచేస్తుంది.


Nara Lokesh
Visakhapatnam
AI Data Center
Andhra Pradesh
Sify Technologies
Open Cable Landing Station
IT Jobs
Digital Gateway
North Andhra
Technology Hub

More Telugu News