ప్లాస్క్‌లోని వేడి టీ.. నాలుగేళ్ల బాలుడి ప్రాణం తీసింది!

  • అనంతపురం జిల్లా యాడికిలో ఘ‌ట‌న‌
  • ప్లాస్క్‌లో ఉంచిన వేడి టీ తాగిన ఇద్దరు చిన్నారులు
  • నాలుగేళ్ల బాలుడు రుత్విక్‌ చికిత్స పొందుతూ మృతి
  • రెండేళ్ల పాప యశస్విని పరిస్థితి విషమం
  • పనికెళ్లిన తల్లిదండ్రులు.. ఇంట్లో జరిగిన ఘోరం
అనంతపురం జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్లాస్క్‌లో నిల్వ ఉంచిన వేడి టీని తాగడంతో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా, అతని రెండేళ్ల చెల్లెలు తీవ్ర అస్వస్థతతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఈ హృదయ విదారక ఘటన యాడికి పట్టణంలో శుక్రవారం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. యాడికి పట్టణంలోని చెన్నకేశవ కాలనీకి చెందిన రామస్వామి, చాముండేశ్వరి దంపతులకు కుమారుడు రుత్విక్‌ (4), కుమార్తె యశస్విని (2) ఉన్నారు. ఈ నెల 8వ తేదీన తల్లిదండ్రులు పనులకు వెళ్తూ, రోజూలాగే ప్లాస్క్‌లో వేడి టీ పోసి ఇంట్లో ఉంచారు. పెద్దలు లేని సమయంలో చిన్నారులిద్దరూ ఆడుకుంటూ ప్లాస్క్‌లోని వేడి టీని గ్లాసుల్లోకి పోసుకుని తాగేశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులెవరూ గమనించలేదు.

కొద్దిసేపటి తర్వాత, వేడికి గొంతు లోపల తీవ్రంగా గాయపడటంతో పిల్లలిద్దరూ నొప్పి తట్టుకోలేక ఏడవడం ప్రారంభించారు. కంగారుపడిన తల్లిదండ్రులు వారిని వెంటనే తాడిపత్రిలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి తరలించారు. అక్కడ ఒకరోజు చికిత్స అందించిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో గురువారం చిన్నారులిద్దరినీ అనంతపురంలోని మరో ప్రైవేటు ఆసుప‌త్రిలో చేర్పించారు.

అక్కడ చికిత్స కొనసాగుతుండగా, పరిస్థితి విషమించడంతో రుత్విక్‌ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. యశస్వినికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పిల్లల పాలిట వేడి టీ శాపంగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా అందరినీ కంటతడి పెట్టించింది.


More Telugu News