Karan Johar: బాలీవుడ్ బంధాలపై కరణ్ జొహార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Karan Johar comments on Bollywood relationships
  • ఇండస్ట్రీలో స్నేహాలన్నీ డబ్బు, అవకాశాల కోసమేనన్న కరణ్
  • నటులు పారితోషికం తీసుకుంటారు కానీ నష్టాలు పంచుకోరని వ్యాఖ్య
  • ఇక్కడ ఆర్థిక ప్రయోజనాలకే ఎక్కువ విలువ ఉంటుందన్న కరణ్
బాలీవుడ్ అంటే రంగుల ప్రపంచం మాత్రమే కాదు, అక్కడ బంధాలు, స్నేహాలకు పెద్దపీట వేస్తారని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఆ బంధాల వెనుక ఉన్న అసలు నిజం వేరే ఉంటుందని ప్రముఖ దర్శక నిర్మాత, ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జొహార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో కనిపించే స్నేహాలు, ఆప్యాయతలు నిజమైనవి కావని, అవన్నీ కేవలం డబ్బు, అవకాశాల చుట్టూనే తిరుగుతాయని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఇండస్ట్రీలో తన అనుభవాలను పంచుకుంటూ, నిర్మాతలకు నష్టాలు వచ్చినప్పుడు నటీనటులు ఏమాత్రం పట్టించుకోరని కరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. "పారితోషికాల విషయంలో మాత్రం నటులు చాలా కచ్చితంగా ఉంటారు. కానీ, సినిమా ఫ్లాప్ అయితే నష్టాల్లో పాలుపంచుకోవడానికి ముందుకురారు. ఇటీవల నా రెండు చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. ఒక్క నటుడు కూడా ముందుకు వచ్చి 'మీ డబ్బు తిరిగిస్తాను' అని చెప్పలేదు. డబ్బు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు కానీ, తిరిగివ్వడానికి ఎవరూ ఇష్టపడరు" అని కరణ్ వాపోయారు.

ఈ పరిశ్రమలో ప్రతిదీ ఒక వ్యాపార వ్యూహంతోనే ముడిపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బంధుప్రీతి కంటే కూడా గ్రూపులుగా ఏర్పడి ఒకరికొకరు అవకాశాలు ఇచ్చుకోవడం ఎక్కువైందని అభిప్రాయపడ్డారు. "నా జీవితంలో స్నేహితులు ఎప్పుడూ సహాయం చేయలేదు. అందరిలాగే నేను కూడా ఇక్కడ వ్యాపారం చేయడానికే ఉన్నాను, సేవా కార్యక్రమాలు చేయడానికి కాదు" అని కరణ్ తేల్చిచెప్పారు. ఆయన మాటలను బట్టి బాలీవుడ్‌లో వ్యక్తిగత అనుబంధాల కన్నా ఆర్థిక ప్రయోజనాలకే ఎక్కువ విలువిస్తారని స్పష్టమవుతోంది.

Karan Johar
Bollywood
Bollywood friendships
Dharma Productions
Bollywood actors
Film industry
Movie business
Film finance
Bollywood gossip
Nepotism

More Telugu News