Jitan Ram Manjhi: బీహార్ ఎన్నికల ముందు ఎన్డీఏలో ముదిరిన సీట్ల వివాదం

Bihar election NDA faces seat sharing challenges with Jitan Ram Manjhi
  • తమకు 15 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ
  • కోరినన్ని సీట్లు ఇవ్వకుంటే పోటీకి దూరం అని స్పష్టం చేసిన వైనం
  • ప్రముఖ కవి కవితను మార్చి సోషల్ మీడియాలో తన డిమాండ్‌ను వినిపించిన మాంఝీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. మిత్రపక్షమైన హిందుస్థాన్ అవామ్ మోర్చా (HAM) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ తన అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేశారు. తమ పార్టీకి కనీసం 15 అసెంబ్లీ స్థానాలు కేటాయించకపోతే ఎన్నికల్లో పోటీ చేయబోమని, అయితే ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు.

సీట్ల పంపకాలపై తన డిమాండ్‌ను వినిపించేందుకు మాంఝీ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రముఖ హిందీ కవి రామ్‌ధారి సింగ్ దిన్‌కర్ రచించిన 'రష్మిరథి' కావ్యంలోని కొన్ని పంక్తులను మార్చి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. మహాభారతంలో పాండవులు కేవలం ఐదు ఊళ్లు అడిగినట్లుగా, తాము 15 స్థానాలు (గ్రామాలు) అడుగుతున్నామని, అవి ఇస్తే చాలని, మిగిలినదంతా మీరే ఉంచుకోవచ్చని ఆ కవిత సారాంశం. ఈ పోస్ట్‌తో ఆయన తన డిమాండ్‌ను పరోక్షంగా బీజేపీ అధిష్ఠానం ముందుంచారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "ఎన్డీఏ నేతల తీరును మేం అవమానంగా భావిస్తున్నాం. మా పార్టీకి గుర్తింపు లభించాలంటే గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కావాలి. మేం ప్రతిపాదించినన్ని సీట్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయం. కానీ, ఎన్డీఏకు మద్దతు ఇస్తాం. నాకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదు, కేవలం మా పార్టీకి గుర్తింపు దక్కితే చాలు" అని ఆయన స్పష్టం చేశారు.

మాంఝీ వ్యాఖ్యలతో అప్రమత్తమైన బీజేపీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా మాంఝీకి ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను, జేడీయూ, బీజేపీ చెరో 100 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ఫార్ములా ప్రకారం మాంఝీ పార్టీకి 10, ఉపేంద్ర కుష్వాహా పార్టీకి 6 సీట్లు కేటాయించవచ్చని తెలుస్తోంది. దీంతో అసంతృప్తికి గురైన మాంఝీ 15 సీట్ల డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. మరోవైపు, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ కూడా తమకు 40 సీట్లు కావాలని పట్టుబడుతుండటంతో ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు కత్తిమీద సాములా మారింది. 
Jitan Ram Manjhi
Bihar election
NDA alliance
HAM party
Seat sharing
Bihar politics
JP Nadda
Chirag Paswan
হিন্দstan Awam Morcha

More Telugu News