Amit Shah: ఇక నా మెయిల్ ఐడీ ఇదే... జీమెయిల్ కు గుడ్ బై చెప్పి జోహో మెయిల్ కు మారిన అమిత్ షా

Amit Shah Switches to Zoho Mail Goodbye Gmail
  • ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో అడుగు
  • తన కొత్త ఈమెయిల్ అడ్రస్‌ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన అమిత్ షా
  • కొద్ది రోజుల క్రితమే జోహోకు మారిన రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
  • ప్రభుత్వ కార్యాలయాల్లో జోహో యాప్స్ వాడాలని విద్యాశాఖ ఆదేశాలు
  • 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా స్వదేశీ టెక్నాలజీకి ప్రోత్సాహం
  • చెన్నైకి చెందిన శ్రీధర్ వెంబు స్థాపించిన సంస్థే జోహో
దేశీయ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'ఆత్మనిర్భర్ భారత్' స్ఫూర్తితో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అధికారిక ఈమెయిల్ సేవలను గూగుల్‌కు చెందిన జీమెయిల్ నుంచి స్వదేశీ సంస్థ అయిన 'జోహో మెయిల్‌'కు మార్చుకున్నారు. ఈ మార్పును ఆయన స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా ప్రకటించారు.

"అందరికీ నమస్కారం, నేను జోహో మెయిల్‌కు మారాను. దయచేసి నా ఈమెయిల్ అడ్రస్‌లో మార్పును గమనించగలరు. నా కొత్త ఈమెయిల్ చిరునామా: [email protected]. భవిష్యత్తులో నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు ఈ చిరునామాను ఉపయోగించగలరు" అని తన పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు.

కేంద్ర మంత్రులు స్వదేశీ సాంకేతికత వైపు మొగ్గు చూపడం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితమే కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా జోహో ప్లాట్‌ఫామ్‌కు మారారు. డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్ల కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక అని ఆయన ప్రశంసించారు. ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులు, సేవలను స్వీకరించాలని ఆయన కోరారు.

మరోవైపు, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా తమ అధికారులందరూ అధికారిక పనుల కోసం జోహో ఆఫీస్ సూట్‌ను ఉపయోగించాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, గూగుల్ వర్క్‌స్పేస్ వంటి విదేశీ ప్లాట్‌ఫామ్‌లకు బదులుగా జోహో రైటర్, జోహో షీట్, జోహో షో వంటి వాటిని వాడాలని స్పష్టం చేసింది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌పై అధికారులకు అవగాహన కల్పించేందుకు ఎన్ఐసీ (NIC) ద్వారా ప్రత్యేక సహాయం అందిస్తున్నట్లు ప్రభుత్వ సర్క్యులర్‌లో తెలిపారు. చెన్నైకి చెందిన శ్రీధర్ వెంబు స్థాపించిన జోహో, ప్రపంచ సాఫ్ట్‌వేర్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం.

ఇటీవలే జోహో అభివృద్ధి చేసిన 'అరట్టై' మెసేజింగ్ యాప్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ రంగంలో నెంబర్ వన్ గా ఉన్న వాట్సాప్ కు సవాల్ విసురుతోంది. 
Amit Shah
Amit Shah Zoho Mail
Zoho Mail
Atmanirbhar Bharat
Ashwini Vaishnaw
Sridhar Vembu
Zoho Office Suite
Made in India
Digital India

More Telugu News